లోక్ సభలో విద్యుత్ సవరణ బిల్లుపై విపక్షాల అభ్యంతరం

లోక్ సభలో విద్యుత్ సవరణ బిల్లుపై విపక్షాల అభ్యంతరం

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ విద్యుత్ సవరణ బిల్లు-2022ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం తమ చేతిలోకి తీసుకుంటోందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విపక్షాల అభిప్రాయం తెలుసుకోకుండా బిల్లును స్టాండింగ్ కమిటీకి ఎలా పంపుతారని, అలాంటప్పుడు బిల్లును ఎందుకు తీసుకొచ్చారని డీఎంకే సభ్యులు ప్రశ్నించారు. ఈ బిల్లుతో పేద రైతులకు అన్యాయం జరుతుందని డీఎంకే సభ్యులు ఆరోపించారు. తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సరవణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. తక్షణమే కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్ గఢ్, పుదుచ్చేరి, సంయుక్త కిసాన్ మోర్చాతో సహా..ఈ బిల్లును అందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతుసంఘాలతో చర్చలు జరుగుతుండగానే బిల్లును ఎలా తీసుకొస్తారని అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. 

విద్యుత్ సవరణ బిల్లు-పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మండిపడ్డారు. ఈ బిల్లుతో పేద రైతులకు ఎలాంటి నష్టం జరగదని, రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందని తెలిపారు. రాయితీలు ఇవ్వడానికి ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రతి రాష్ట్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లు కచ్చితంగా ప్రజలకు మేలు చేస్తోందని ఆర్కే సింగ్ వివరించారు.