గాజులు వేసుకున్నావ్ కాబట్టే వెంటపడ్డారు : యూపీ పోలీసు

గాజులు వేసుకున్నావ్ కాబట్టే వెంటపడ్డారు : యూపీ పోలీసు

“సర్ … నన్ను వేధిస్తున్నారు.. వెంటపడుతున్నారు… వారి నుంచి మీరే కాపాడాలి” అంటూ ఓ నిస్సహాయురాలు పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. ధైర్యం చెప్పి.. సమస్య పరిష్కరించి ఆదుకోవాల్సిన పోలీస్ అధికారి.. ఆమెను మరింతగా కించపరిచేలా మాట్లాడాడు. ఆ పోలీసుకు డిమోషన్ ఇచ్చి… కిందిస్థాయికి పంపించేశారు ఉన్నతాధికారులు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.

కాన్పూర్ జిల్లా నజీరాబాద్ పోలీస్ స్టేషన్ కు ఓ అమ్మాయి వచ్చింది. పోకిరీల వేధింపులపై కంప్లయింట్ ఇవ్వడానికి వస్తే… ఆ పోలీస్ అధికారి ఆమె చెప్పేది పూర్తిగా వినకుండా.. కంప్లయింట్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. “అసలు నువ్వు చెవులకు ఆ రింగులు ఎందుకు పెట్టుకున్నావ్… మెడలో గొలుసులు ఎందుకు వేసుకున్నావ్… లాకెట్ ఎందుకు ధరించావు… ఇన్ని వేసుకుంటే నీ వెంట పడరా.. నిన్ను వేధించరా… నువ్వు చేసుకున్న అలంకరణే నువ్వేంటో చెబుతోంది” అంటూ ప్రశ్నలు అడిగాడు. బాధితులు ఈ మొత్తం వ్యవహారాన్ని తమ ఫోన్ లో రికార్డ్ చేయడంతో… సదరు పోలీస్ ఆఫీసర్ వ్యవహారం బయటకొచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో… ఉన్నతాధికారులు స్పందించి… ఆ పోలీస్ ఆఫీసర్ ను కిందిస్థాయి ఉద్యోగానికి డిమోషన్ మీద పంపించారు.