వచ్చే నెల 2న రంగనాథ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం

వచ్చే నెల 2న రంగనాథ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం

మెహిదీపట్నం, వెలుగు: వచ్చే నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శ్రీ రంగనాథ స్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాల్లో లైట్లు, భక్తుల సౌకర్యం కోసం మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

వెహికల్స్​పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి అవసరమైన పనులు పూర్తి చేయాలన్నారు. వెహికల్ డైవర్షన్​కు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో బల్దియా జోనల్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్లు దర్శన్, కరుణాకర్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటి, డీఎంసీ నర్సింహ, ఈఈ వెంకట శేషయ్య, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.