న్యూఢిల్లీ, వెలుగు : ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల టైంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 333.55 కోట్లను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో రూ. 114.41 కోట్ల నగదు, రూ. 76.26 కోట్ల లిక్కర్, రూ. 29.31 కోట్ల డ్రగ్స్, రూ. 77.23 కోట్ల విలువైన వస్తువులు (బంగారం, ఆర్నమెంట్స్) వంటివి ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు/యూటీల్లో రూ. 8,889.74 కోట్లను సీజ్ చేసిన కమిషన్ జాయింట్ డైరెక్టర్ అన్జు చందక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో రూ. 849.15 కోట్ల నగదు, రూ. 814.85 కోట్ల మద్యం, రూ. 3, 958 కోట్ల డ్రగ్స్ వంటివి ఉన్నాయని వివరించారు. అత్యధికంగా గుజరాత్ లో రూ. 1461.73 కోట్లు (ఇందులో నగదు కేవలం రూ.8.61 కోట్లు), రాజస్థాన్ లో రూ. 1133.82 కోట్లు (నగదు కేవలం రూ. 42.30 కోట్లు) సీజ్ అయినట్లు వెల్లడించారు. ఏపీలో అత్యధికంగా రూ. 142.56 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
