మారుతీరావు ఆస్తుల విలువ 200కోట్లు

మారుతీరావు ఆస్తుల విలువ 200కోట్లు

ప్రణయ్ హత్య కేసులో పోలీసులు 1600 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని  ప్రముఖ వ్యాపారి మారుతీరావు కూతురు అమృత. ప్రణయ్ అనే యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. పరువు పోయిందని భావించిన మారుతీరావు రూ. కోటి సుపారీ ఇచ్చి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ని హత్య చేయించిన విషయం తెలిసిందే. కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఈ నెల 8న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు పోలీసులు కోర్టులో వేసిన చార్జ్​షీట్​లో మారుతీరావు పేరిట ఉన్న ఆస్తుల వివరాలను పొందుపర్చారు. పట్టణంలోని అద్దంకి–నార్కెట్​పల్లి  బైపాస్ వెంట ఆరు ఎకరాలు, తాళ్ల గడ్డ, ఈదులగూడ, బాదలాపురంలో ఇళ్ల స్థలాలు, గూడూరులో 20 గుంటల భూమితో పాటు ఫ్లై ఓవర్​ వద్ద   1.21 ఎకరాల స్థలం ఉన్నాయి.  అదే విధంగా నందిపాడు శివారులోని శరణ్య గ్రీన్ హోమ్స్ లో మారుతి రావు, శ్రవణ్ కుమార్ ఇంటి స్థలాలు,  అపార్ట్​మెంట్లు,  డాక్టర్స్ కాలనీ ఓల్డ్​ నటరాజ్ థియేటర్ ఏరియాలో అమృత పేరుతో హాస్పిటల్, ఈదులగూడలో వారి అమ్మ పేరిట 7 గుంటల  స్థలం, పట్టణంలో రెండు షాపింగ్​మాల్స్​తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్​మెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది.  వీటి విలువ మార్కెట్లో రూ. 200 కోట్ల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా.