ఎమ్మెల్యే ఆరూరికి నిరసన సెగ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై నిలదీత

ఎమ్మెల్యే ఆరూరికి నిరసన సెగ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై నిలదీత

అనుచరులకు పథకాలు  ఇప్పించుకున్నారని ఆగ్రహం

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​కు నిరసన సెగ తగిలింది. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను స్థానిక యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. పదేండ్లలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో రోజుకో మాటతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి అబద్దపు మాటలతో తమను మాయ చేయడానికి వచ్చారా అని నిలదీశారు. అనుచరులకు సంక్షేమ పథకాలను ఇచ్చుకొని పేదలకు అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వర్ధన్నపేట మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్,  కాంగ్రెస్ లీడర్లు బిర్రు రాజు, తాటికాయల దిలీప్, గోలి రాజేశ్, బిర్రు బాబును పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత వదిలిపెట్టారు.