సిటీల నుంచి వస్తే.. బంధువులైనా ఊళ్లోకి రానీయట్లే

సిటీల నుంచి వస్తే.. బంధువులైనా ఊళ్లోకి రానీయట్లే
  • కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో గ్రామాల్లో అలర్ట్
  • గవర్నమెంట్ హాస్పిటళ్లల్లో సరైన వసతులు లేవు
  • జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంక్ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో గ్రామాల్లో కొత్తవాళ్లను ఊళ్లోకి రానీయట్లే. బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇళ్లల్లోకి అనుమతించట్లే. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సిటీల నుంచి సొంతూళ్లకు వచ్చేవాళ్లను గ్రామాల్లోకి అనుమతించరాదని విలేజ్ కౌన్సిళ్లకు అధికారులు సూచించారు. అలా వచ్చినవాళ్లను స్కూళ్లలో లేదా ఊరి బయట ఉంచుతున్నరు. గ్రామాలతోపాటు చిన్న టౌన్ లలో కూడా ఇదే పరిస్థితి ఉందని జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంక్ చెప్పారు. 21 రోజుల లాక్ డౌన్ ప్రకటన తర్వాత 90 లక్షల మంది సిటీల నుంచి సొంతూళ్లకు వెళ్లారని, వాళ్ల నుంచి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రూరల్ ఇండియాలో 0.03 శాతం మందికి కరోనా సోకినా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బెడ్లు సరిపోవన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే మందులు, ఎక్విప్ మెంట్లు, టెస్టింగ్ పరికరాల కొరత ఉందని చెప్పారు. 60 శాతం హాస్పిటళ్లలో పీపీఈల కొరత ఉందని, కొన్నింటిలో ఆప్రాన్స్ కూడా లేవన్నారు. 1.7 కోట్ల పీపీఈలు, 49 వేల వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించిందని గుర్తు చేశారు. బ్రెజిల్ కు సమానంగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో 11, బీహార్ లో 4 టెస్టింగ్ సెంటర్లు మాత్రమే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సాధారణంగా డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లకు ఎక్కువగా వస్తారని, బెడ్లు సరిపోక నేలపైనే చికిత్స అందిస్తుంటారని, ఇది కరోనాకు ముందున్న పరిస్థితి అని ఢిల్లీకి చెందిన పీపుల్స్ హెల్త్ మూవ్ మెంట్ గ్లోబల్ కోఆర్డినేటర్ సుందరరామన్ చెప్పారు. జిల్లా ఆస్పత్రుల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కరోనా పేషెంట్లు పెరిగితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు.