అడవి బిడ్డలకు వైరల్ ఫీవర్స్

అడవి బిడ్డలకు వైరల్ ఫీవర్స్

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు పడకేశాయి. వానా కాలం షురూ కావడంతో అడవి బిడ్డలు జ్వరాలతో మంచం పట్టారు. మలేరియా, వైరల్ ​ఫీవర్లతో వణికిపోతున్నారు. వీరికి వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. అటవీ ప్రాంతాల నుంచి దవాఖానాలకు వెళ్దామంటే  రోడ్డు సౌకర్యం లేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. వాగులు, వంకలు అడ్డం వస్తుండడంతో తోటి గిరిజనులే కావడి కట్టి తీసుకుపోవడం, మంచాలపై వేసుకుని దాటించడం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నచోట్ల అంబులెన్స్​లు టైంకు రాక మధ్యలోనే చనిపోతున్నారు. ఒకవేళ అదృష్టం మంచిగుండి హాస్పిటల్​ వరకూ వెళ్లినా సిబ్బంది, డాక్టర్ల కొరత, సౌలతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పాములు, తేళ్లు వంటివి కుట్టి దవాఖానాల బాట పడితే అక్కడ విరుగుడు మందుల్లేక కాటికి పోతున్నారు.  

భద్రాచలంలో సిబ్బంది లేరు 

భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా జ్వరాలతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. ఎక్కువ మంది వైరల్ ​ఫీవర్, మలేరియా బారిన పడేవారే ఉంటున్నారు. జిల్లాలో 29 పీహెచ్​సీలు,15 రౌండ్​క్లాక్​ పీహెచ్​సీలు, 240 సబ్​సెంటర్లున్నా అన్ని చోట్లా సిబ్బంది కొరత వేధిస్తున్నది. ప్రతి సబ్​సెంటర్​కు రోజూ 10 నుంచి 15 మంది జ్వరాలతో క్యూ కడుతున్నారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని 24  గంటల దవాఖానాలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. ఈయన కూడా మీటింగులనీ..ఇతర పనులనీ అందుబాటులో ఉండడు. చాలా సబ్​ సెంటర్లలో ఒక్కరే ఏఎన్​ఎం ఉంటున్నారు. 45 సబ్​ సెంటర్లలో ఎక్కడా ఫస్ట్​ఏఎన్ఎంలు కనిపించడం లేదు. వైద్యారోగ్యశాఖ పరిధిలో పని చేసే పీహెచ్​సీల్లో 65 మంది డాక్టర్లకు 41 మంది, వైద్యవిధాన పరిషత్ దవాఖానాల్లో  99 మంది డాక్టర్లకు  45 మంది మాత్రమే పని చేస్తున్నారు. భద్రాచలం ఏరియా దవాఖానాలో 207 మంది సిబ్బందికి 77 మందే ఉన్నారు. భద్రాచలం ఐటీడీఏలో ఉన్న  డ్రగ్ స్టోర్ ను రెండేండ్ల కింద మూసేయగా, ఖమ్మం నుంచి మందులు రావడానికి ఆలస్యమవుతున్నది. నేషనల్ రూరల్​ హెల్త్ మిషన్​ కింద ఏటా ప్రతి సబ్​సెంటర్​కు రూ.10 వేలు,  పీహెచ్​సీలకు రూ. 15 వేలు అన్ టైడ్​ ఫండ్స్ వచ్చేవి. వీటితో శానిటేషన్​, అత్యవసర వైద్య పరికరాల కొనుగోలు చేసేవారు. యుటిలైజేషన్​ సర్టిఫికెట్లు(యుసీ) ఇవ్వకపోవడంతో ఇప్పుడు సబ్​సెంటర్లకు ఈ ఫండ్స్​ రిలీజ్​ చేయడం లేదు.  

ప్రతి ఇంట్లో ఒకరికి జ్వరం

జయశంకర్‌‌ భూపాలపల్లి, ములుగు, ఏటూరునాగారం :  ఏటూరునాగారం ఏజెన్సీలో ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఐటీడీఏ  పరిధిలో 21 పీహెచ్​సీలు, ఏటూరునాగారం, గూడూరులో 2 సీహెచ్​సీలున్నాయి. వీటిల్లో  967 మంది సిబ్బందికి 760 మంది మాత్రమే ఉండగా, 31 మంది మెడికల్​ఆఫీసర్లకు 13 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 109 మంది సెకండ్ ఏఎన్ఎంలు పని చేయాల్సిఉండగా అన్ని  పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సరైన రోడ్డు సౌకర్యాలు లేకపోవడం, వాగులు, వంకలపై బ్రిడ్జిలు కట్టకపోవడంతో జ్వరాలతో బాధపడుతున్నవారిని దవాఖానాలకు తరలించడానికి తిప్పలు పడాల్సి వస్తున్నది. నాలుగురోజుల కింద తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ముత్యారావు అనే వ్యక్తిని ట్రాక్టర్​పై ఏటూరునాగారానికి తరలిస్తుండగా కన్నాయిగూడెం,  ఐలాపురం గ్రామాల మధ్య జంపన్నవాగు ఉప్పొంగడంతో ట్రాక్టర్ దిగబడింది. దీంతో తంటాలు పడి బాధితుడిని దవాఖానాకు తీసుకెళ్లాల్సి వచ్చింది. 108 అంబులెన్స్​లు గ్రామాలకు వచ్చే పరిస్థితి లేక కావడిలో మోస్తూ, మంచాలపై కట్టి  వాగులు దాటించాల్సి వస్తున్నది. రిమోట్ ఏరియాకు డైరెక్ట్​గా ఫండ్స్ ​ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం సింగిల్ ​నోడల్​ఏజెన్సీ పద్ధతిలో పీహెచ్​సీల ఖాతాల్లో ప్రతి నెలా రూ.87 వేలు జమ చేస్తోంది.  మందుల కొనుగోలుకు ఈ ఫండ్స్​ఖర్చు చేయాల్సి ఉండగా చాలాచోట్ల పాము, తేలు కాటుకు మందులు దొరకడం లేదు. ఏజెన్సీలో రోడ్డు లేని, వ్యాధులు ఎక్కువగా ప్రబలే ఛాన్స్​ ఉన్న 194 గ్రామాలను గుర్తించగా, ఇక్కడ వైద్యసేవలపై ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు.  

కిటకిటలాడుతున్న దవాఖానాలు

ఆసిఫాబాద్ :  కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా పరిధిలోని ఉట్నూర్ ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. ఆసిఫాబాద్ సీహెచ్ సీ లో నాలుగు రోజుల క్రితం వరకు రోజూ 150 నుంచి 170  మధ్య ఓపీ ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం12.30 గంటల వరకు ఏకంగా 280 మంది రోగులు వచ్చారు. బెజ్జూర్, కౌటాల , సిర్పూర్ టి, చింతలమానేపల్లి మండలాల్లో వారం రోజులుగా ఓపీ పెరుగుతోంది. ఇక్కడ పీహెచ్​సీల్లో వారం కింది వరకు 20 మంది రోగులు వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయ్యింది. వీరిలో ఎక్కువమంది జ్వరంతో బాధపడుతున్నవారే ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల పీహెచ్​సీలో ప్రతి రోజూ 50 మంది దాకా పేషెంట్లు వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 80కి పెరిగింది. ఇందులో ఎక్కువగా వైరల్ ఫీవర్ కేసులు ఉంటున్నాయి. బజార్​హత్నూర్​ పీహెచ్​సీకి వారం కింది వరకు 30 ఓపీ ఉండగా, ఇప్పుడది 60 దాటుతోంది.  ఆసిఫాబాద్ జిల్లాలోని 22 పీహెచ్ సీ లలో సరిపడా డాక్టర్లు లేరు. 46 పోస్టులు శాంక్షన్​కాగా 22 మంది పని చేస్తున్నారు. దీంతో స్టాఫ్​ రోగులకు తెలిసిన మందులు ఇచ్చి పంపుతున్నారు.

మా ఊరిలో సబ్​సెంటర్  ​పెట్టాలె

వానాకాలం ట్రీట్​మెంట్​కు ఇబ్బందులు పడుతున్నాం. సరైన రోడ్డు లేదు. వాగులో బ్రిడ్జి లేదు. జ్వరాలు సోకితే టైమ్ కి హాస్పిటల్ కు చేరుకోలేకపోతున్నం. మా కష్టాలను తీర్చాలె. మా ఊరిలో హెల్త్​ సబ్​సెంటర్​ పెట్టి ట్రీట్​మెంట్ ​అందించాలె.

– మాడవి శ్యామ్ దేవ్ , చితకర్ర , జైనూర్

పోస్టులు భర్తీ చేస్తాం

భద్రాచలం మన్యంలో జ్వరాలకు సంబంధించి అలర్ట్ గానే ఉన్నాం. మందుల కొరత లేకుండా చూస్తాం. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. డాక్టర్ల భర్తీకోసం ఇప్పటికే నోటిఫికేషన్లు వచ్చాయి. 

- డా.దయానందస్వామి,
 డీఎంహెచ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం

రెండు నెలలకు సరిపడా మందులు ఉన్నాయి

ఏజెన్సీ ఏరియాలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రెండు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచాం. ప్రతీ ఫ్రైడే డ్రై డే పాటించడంతోపాటు దోమల మందు స్ప్రే చేస్తున్నాం. అన్ని పీహెచ్​సీల పరిధిలో మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే వైద్యాధికారులు, సిబ్బందికి సూచనలు చేశాం. దోమతెరలు పంపిణీ చేస్తాం.  

‒డాక్టర్​ అల్లెం అప్పయ్య, 
డీఎంహెచ్‌‌ఓ, ములుగు జిల్లా