వరల్డ్ కప్ సెమీస్ ఓటమి నన్ను బాధించింది

వరల్డ్ కప్ సెమీస్ ఓటమి నన్ను బాధించింది

న్యూఢిల్లీ: వైఫల్యాలకు ఎవరైనా కుంగిపోతారని, దీనికి తానేమీ అతీతుడిని కాదని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. ఫెయిల్యూర్స్‌‌ ఎదురైనప్పుడు కచ్చితంగా ప్రభావితం అవుతానని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్‌‌కప్‌‌లో సెమీస్‌‌ ఓటమి తనను చాలా బాధించిందన్నాడు. ‘అపజయాలకు నేను ప్రభావితం అవుతానా? అంటే ఎస్‌‌ అనే చెబుతాను. నేనొక్కడినే కాదు.. ఎవరైనా బాధపడతారు. సెమీస్‌‌ మ్యాచ్‌‌లో టీమ్‌‌కు నా అవసరం చాలా ఉందని తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును ఆదుకోవాలని నా మనసులో గట్టిగా అనుకున్నా. కానీ అది సాధ్యపడలేదు. అప్పుడు.. అలా ముందే ఎలా ఊహిస్తావని నా ఈగో ప్రశ్నించింది. బలమైన సంకల్పం, పట్టుదల ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అది లేనప్పుడు మనం అనుకున్నది ఏదీ జరగదు’ అని విరాట్‌‌ వెల్లడించాడు. ఓటమంటే తనకు ద్వేషమని చెప్పిన కోహ్లీ…  ఫీల్డ్‌‌లోకి దిగడాన్ని గౌరవంగా భావిస్తానన్నాడు. ‘పరాజయమంటే నాకు పడదు. ఓటమితో బయటకు రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాలో శక్తి ఉన్నంతవరకు గెలిచేందుకే పోరాడుతా. మా ఆట గురించి భవిష్యత్‌‌ తరాలు గొప్పగా చెప్పుకోవాలి. వాళ్లకు స్ఫూర్తిగా, వారసత్వంగా నిలవాలి’ అని వెస్టిండీస్‌‌తో లిమిటెడ్‌‌ సిరీస్‌‌కు సిద్ధమవుతున్న కెప్టెన్‌‌ వ్యాఖ్యానించాడు.