హిజాబ్ ధరించిన మహిళను పీఎంగా చూడాలనుంది : ఓవైసీ

హిజాబ్ ధరించిన మహిళను పీఎంగా చూడాలనుంది : ఓవైసీ

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.  కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన ఓవైసీ.. హిజాబ్ గురించి ప్రస్తావించారు. హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ముస్లింలు తినే మాంసం, ధరించే టోపీలు, గడ్డాలను వారు ప్రమాదకారకాలుగా చూస్తున్నారని, ముస్లిం ఆహారపు అలవాట్లతో వారికి సమస్య ఉందన్నారు. ముస్లిం గుర్తింపుకు ఆ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. భారతదేశ వైవిధ్యాన్ని, ముస్లిం గుర్తింపును అంతం చేయడమే బీజేపీ అసలు ఎజెండా అని ఆయన ఆరోపించారు. సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి మాటలన్నీ ఉత్తవేనని చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పట్టు సాధించాలని ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని AIMIM యోచిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం భవిష్యత్తులో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని పార్టీలో చేరతారని కూడా ఉత్తరప్రదేశ్ AIMIM అధ్యక్షుడు షౌకత్ అలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.