రైతుల నుంచి ప్రతి గింజ కొనేవిధంగా చూస్తాం

 రైతుల నుంచి ప్రతి గింజ కొనేవిధంగా చూస్తాం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్: రైతుల నుంచి ప్రతి బియ్యం గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. వరంగల్ రూరల్ కలెక్టరేట్ లో కోవడ్ నియంత్రణ, వరి ధాన్యం కొనుగోలు పై జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీఛైర్మన్ గండ్ర జోతి, కలెక్టర్ హరిత, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు లో రైతులు నానా కష్టాలు పడుతున్నా అధికారులు సహరించటం లేదని ధ్వజమెత్తారు. కనీసం గన్ని బ్యాగులు కావాలని అధికారులను కోరినా స్పందించడం లేదంటూ అధికారుల తీరుపై ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కలెక్టర్, ఎమ్మెల్యే ల మధ్య కొంతసేపు వాగ్వాదం జరుగగా మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చ చెప్పారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ దేవాదుల - కాళేశ్వరం జలాల వల్ల పంట దిగుబడి విపరీతంగా పెరిగిందని, ధాన్యం అమ్మకాలలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించామని, ఆ ఇబ్బందులను అధిగమించి ప్రతి గింజ కొనే దిశలో చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిల్లర్లు సహకరించకపోయినా రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామని చెప్పారు. 

లాక్ డౌన్ పొడిగింపుపై అందరి అభిప్రాయాలు సేకరించి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం
కరోనా నివారణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.  ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని వసతులు వున్నాయి.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. వ్యాక్సిన్ సరఫరా కూడా వేగంగా జరుగుతోందన్నారు. లాక్ డౌన్ పొడిగింపు విషయం పై MLAలు, ఇతర ప్రజాప్రతి నిధులు, అధికారుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, క్యాబినెట్ మీటింగ్ లో  సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.