నేత చీరల కళా నైపుణ్యం.. ప్రపంచ స్థాయి గుర్తింపు

నేత చీరల కళా నైపుణ్యం.. ప్రపంచ స్థాయి గుర్తింపు

చేనేత రంగానికి పెట్టింది పేరు నారాయణపేట జిల్లాది. పట్టు చీరల వ్యాపారానికి కేరాఫ్ అడ్రెస్...ఇక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. నేత చీరల కళా నైపుణ్యం ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. రంగు రంగుల చీరలకు, అందమైన హస్తకళను జోడించి అదిరిపోయే చీరలు నేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్లు, శుభకార్యాలకు కోట్లల్లో నారాయణపేట పట్టు చీరల వ్యాపారం జరుగుతోంది. అలాంటి పట్టు చీరలు.. చేనేత కార్మికులపై స్పెషల్ స్టోరీ.
నారాయణపేట చేనేత రంగానికి వందేళ్ల చరిత్ర ఉంది. సంస్థానాధీశుల కాలం నాటి నుంచే పట్టు వస్త్రాల తయారీలో ఎంతో ప్రసిద్ది చెందింది. తరతరాల నుంచి వస్తున్న కళను కాపాడుకుంటూ నేతన్నలు అందమైన పట్టుచీరలను తయారు చేస్తున్నారు. నారాయణపేట, కోటకొండ చేనేత పట్టు చీరల తయారీలో ఎంతో ప్రత్యేకత ఉంది. గుంత మగ్గాల్లో, నేత పనికి అనుకూలంగా ఉండే మట్టి ఇళ్లలో చీరలను నేస్తారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా చీరను తయారు చేసే కల ఇక్కడి కళాకారుకు సొంతం.

నారాయణపేట నేతన్నలు తయారు చేసే  పట్టు చీర ఖరీదు12 వందల నుంచి 40 వేల వరకు ఉంటుంది. ఒక్కో చీర తయారీకి రాత్రింబవళ్లూ కష్టపడతారు. పేట చీరల ఆదరణ ఎక్కువుండటంతో.. వీటిని ఆన్ లైన్ షాపింగ్ కోసం అందుబాటులో ఉంచుతున్నారు. డైరెక్ట్ సేల్స్ తోపాటు ఆన్ లైన్ సేల్స్ లోనూ నారాయణపేట చీరలకు డిమాండ్ ఏర్పడింది. నారాయణపేట, కోటకొండలో సుమారు వంద దుకాణాలున్నాయి. ఇళ్లల్లోనే రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఒక్క నెలలో కోట్లల్లో చీరల వ్యాపారం జరుగుతుంది. పెళ్లిళ్ల సీజన్లో 70 నుంచి 100 కోట్ల  వ్యాపారం జరుగుతుంది. నారాయణపేట  పట్టు చీరలు కొనేందుకు హైదరాబాద్, ముంబయి.. సహా ఇతర రాష్ట్రాల వాసులు వస్తారు. నారాయణపేట చీరలు అని హైదరాబాద్ లో దుకాణాలు పెట్టుకుని అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని ప్రతి పట్టుచీరల షాపులో నారాయణపేట బ్రాండ్ కు డిమాండ్ ఉంటుంది. ఇక్కడి నేతన్నలు హైదరాబాద్ వ్యాపారులకు బల్క్ లో చీరలు అమ్ముతుంటారు. రకరకాల డిజైన్లలో పట్టు చీరలు తయారు చేసి... కస్టమర్లను ఆకర్షిస్తున్నరు ఇక్కడి నేతన్నలు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పట్టు చీరల వ్యాపారంపై ఆధారపడి వేలాది చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం చేయూతనిస్తే మరిన్ని డిజైన్లలో పట్టు చీరలను తయారు చేస్తామంటున్నారు నేతలు.