జాబ్‌ పోతే ఏమైతది! ఇలా చేస్తే బేఫికర్..

జాబ్‌ పోతే ఏమైతది! ఇలా చేస్తే బేఫికర్..

‘జాబ్‌ ఉంటే చాలు.. అన్నీ సెట్‌ అయిపోతయ్‌ ’ అన్నది అందరూ చెప్పే మాట. నిజమే. నెలనాడు పైసలు చేతికి అందుతుంటే బతుకు బాగానే ఉంటది. అయితే అన్నిసార్లూ లైఫ్‌ మనం అనుకున్నట్టే ఉంటదా? ఎప్పుడు ఏమైతదో తెల్వదు. సడెన్‌‌గా, మనం చేస్తున్న ఉద్యోగం పోవొచ్చు. అప్పుడు ఎట్ల ఉంటది? ఈఎమ్‌ఐలు, ఇంటి ఖర్చులు.. ఒక్కటా రెండా అన్నీ బయటపడుతుంటయి. జాబ్‌ పోవాలని ఎవ్వరం కోరుకోం, పోతదని అనుకోం కూడా! ఒక్కసారే అట్లాంటి పరిస్థితే ఎదురైతే మాత్రం కుంగిపోవద్దు. అలా కుంగిపోకుండా ఎట్ల ఉంటం అంటరా? అయితే ఇది చదవండి.

మూడు వీకెండ్స్‌ , ఆరు ఈఎంఐలతో లైఫ్‌ హ్యాపీగా సాగిపోతోంది. లైఫ్‌‌లో ఇంతకన్నా ఏం కావాలని సాఫ్ట్‌ వేర్‌, ఐటీ కంపెనీ ఉద్యోగుల్ని చూసి చాలామంది అనుకుంటరు. జీతానికి తగ్గట్టే వర్క్‌ స్ట్రెస్‌ ఉంటదని ఆ ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కష్టాలు చెప్పుకుంటరు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు ఇప్పుడు లే ఆఫ్స్‌ వాళ్లని భయపెడుతున్నయ్‌. కంపెనీ నుంచి వెళ్లిపొమ్మంటే జీవితం నుంచే తప్పుకుంటున్నరు కొందరు ఉద్యోగులు. అయినవాళ్లందరికీ దూరం కావాలనుకునే ఆలోచన కట్టిపెట్టి వేరే దారులు ఏమున్నాయో ఆలోచించాలె. ఆచరించాలె.

ఐటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా మంటే.. ‘ఇక వెనుదిరిగి చూసేదేమీ లేదు. లైఫంతా హ్యాపీ’ అనుకుంటే పొరపాటే. ఆ ఉద్యోగాల్లో పెర్ఫార్మెన్స్‌ రేటింగ్‌ ఎప్పుడూ ముఖ్యమే. ఉద్యోగం కోసం ఎంత కష్టపడాలో ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలంటే అంతకంటే ఎక్కువ కష్టపడాలె. ఏడాది కష్టాన్నంతా లెక్కగట్టి రేటింగ్‌‌లు ఇచ్చే సీజన్‌‌ ఇదే. జాబ్‌‌లో పెర్ఫార్మెన్స్‌, రిజల్ట్‌‌ ఆధారంగా ఎంప్లాయిస్‌కి ఫస్ట్‌‌, సెకండ్‌, థర్డ్‌, ఫోర్త్‌ రేటింగులు ఇస్తరు. ఇచ్చే రేటింగ్‌‌కి పెర్ఫార్మెన్సే కారణం. కానీ, అదంతా నిజం కాదు. ఒక కంపెనీ ఎంతమంది ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని చూస్తదో అంత మందికి ఫోర్త్‌ రేటింగ్‌ ఇచ్చి పొమ్మంటది. లేకుంటే పొమ్మని పొగబెడతది. పోయిన ఏడాది మన హైదరాబాద్‌ ఐటీ ఇండస్ట్రీలో 8 శాతం మందికి ఫోర్త్‌ రేటింగ్‌ ఇచ్చిన్రు. ఇప్పుడు 17 శాతం మందికి ఫోర్త్‌ రేటింగ్‌ ఇచ్చిన్రు. వీళ్లను ఇంప్రూవ్‌ చేసుకోమని చెప్పొచ్చు. లేకపోతే ఉద్యోగంలోంచి తప్పుకోమనొచ్చని చాలా మందికి డౌట్‌ . ‘ఏదైనా ఉద్యోగంలోంచి తప్పించేందుకే ఈ ప్లాన్’ అని టెకీలు అనుకుంటున్నరు. ఇప్పుడు రేటింగ్‌ .. లే ఆఫ్‌ భయంతో ఉద్యోగులు డిప్రెషన్‌‌లోకి పోతున్నరు. ఇది ఎక్కడిదాక పోతదోనని భయపడుతున్నరు.

మోయలేని భారం.. ఈఎంఐ
ఉద్యోగం పోతే ఇంకో కంపెనీలో ఉదోగ్యం చూసుకోవచ్చు. అంతకాలం జీతం లేకుండా ఉండాలంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంటది. సేవింగ్స్‌ ఉండవు. వచ్చే జీతానికి తగ్గట్టుగా అప్పులు చేసి నెత్తిమీద తీర్చలేని బరువు పెట్టుకుంటారు. ‘ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం చూసుకుందాంలే’ అనే భరోసా లేకుండా చేసి, ‘ఇప్పుడెట్ల బతకాలె’ అనే దీనస్థితిలోకి నెట్టేది ఈ ఈఎంఐలే. ఒకప్పుడు ఆస్తుల విలువ లెక్కగట్టి అప్పులిచ్చేటోళ్లు. ఇప్పుడు జీతం ఎంత వస్తుందో చూసి అప్పులిస్తున్నరు. ఆ జాబ్‌ పోయిన తర్వాత జీతం పోతది. అప్పు మిగులుతది. ఉండే ఇల్లు, తిరిగే కారు, ఏసీ, వాషింగ్‌ మెషిన్‌‌, టీవీ అన్నీ అప్పులే. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఈఎంఐలు కట్టాల్సిందే. కట్టకుంటే కేసులే కాదు. ఇంకెక్కడా అప్పు పుట్టకుండా క్రెడిట్‌ స్కోర్‌‌ తగ్గుతది. ఇట్లాంటి అప్పులు లేకుండా ముందు చూపుతో ఉండాలనే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే భయానికి, తీవ్రమైన మానసిక వేదనకు ముఖ్యమైన కారణం. ఒకప్పుడు రిటైర్‌‌ అయ్యేముందు ఓ ఇల్లు కొనాలనుకునే టోళ్లు. పీఎఫ్‌ డబ్బుతో ఇల్లు కొనేటోళ్లు. ఇప్పుడట్ల కాదు. పాతికేళ్లకే జాబ్‌ వస్తంది. ఉద్యోగం వచ్చిందంటే సొంతిల్లు కొనేస్తున్నరు. ట్యాక్స్‌ బెనిఫిట్స్‌, ఊరించే ఆఫర్లు, వెంటపడే కంపెనీలు అప్పులు అంటగట్టి పోతయ్‌. సేవింగ్స్‌ లేకుండా శాలరీనే నమ్ముకుంటే ఆర్థికంగా చాలా కష్టం. అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలె. ముఖ్యంగా సేవింగ్స్‌ ముఖ్యమని గుర్తించాలె.

రెండో ప్లాన్‌ ఉండాలె
ఉద్యోగం పోతే అవమానంగా ఫీలయ్యేవాళ్లే ఎక్కువ. ఉద్యోగంలో నుంచి తీసేసిన్రంటే సమాజంలో కూడా చిన్నచూపు చూసేటోళ్లున్నరు. ఉద్యోగం పోయినప్పుడు వేరే కంపెనీలో ట్రై చేస్తే కూడా ఇబ్బందులే ఉంటయ్‌. కొత్త కంపెనీలో జాబ్‌‌కి ట్రై చేస్తే పాత కంపెనీలో పెర్ఫామెన్స్‌ ఎట్లుందోనని థర్డ్‌ పార్టీతో ‘బ్యాక్‌‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌‌’ చేయిస్తరు. బ్యాక్‌‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌‌ కోసం కంపెనీలు డేటా మేనేజ్‌ చేస్తయి. ఆ ఎంక్వైరీతో వేరే కంపెనీలో కూడా అవకాశాలు లేకుండా పోతయని భయపడతరు. అయినా భయపడాల్సిన అవసరమే లేదు. ఉద్యోగం తీసేయడానికి కంపెనీలకు ఉద్యోగుల అవసరం తగ్గడం కూడా ఒక కారణమే. దేశంలో ఫైనాన్షియల్‌గా స్లో డౌన్ పరిస్థితులు ఏర్పడటం, ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌ వల్ల కంపెనీలకు ఉద్యోగుల అవసరం తగ్గుతున్నది. డిఫరెంట్‌ టెక్నాలజీలు ఉంటయి. అందరూ అన్ని జాబులు చేయలేరు. ఇంతకు ముందు కంపెనీలో ఏ టెక్నాలజీపై పనిచేశారో అదే టెక్నాలజీపై ఆధారపడ్డ జాబ్‌ లోకి పోవాలె. కాంపిటీటివ్‌ కంపెనీలు ఉండాలె. అందువల్ల అవకాశాలు తక్కువగా ఉన్నయి. ఈ నిజాల్ని గుర్తించకుండా నేను ఏమీ చేయలేననే భావనలోకి పోతున్నరు. ఉద్యోగం వచ్చిన తర్వాత కంపెనీలో ఎదగడానికి కూడా ‘ప్లాన్‌‌ బి’ ఉంటది. అట్లనే ఆ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం లేదా మరో పని కోసం కూడా ‘ప్లాన్‌‌ బి’ ఉండాలె. ఆ కంపెనీలో లేకపోతే ఆ ఉద్యోగంలో ఫిట్‌ కాకపోతే చేయడానికి ‘ప్లాన్‌‌ బి’ ఉండాలె. అంతేకానీ ‘ఇదే నా జీవితం’ అని ఉద్యోగి అనుకోకూడదు. ఫ్యామిలీ కూడా అట్ల స్ట్రెస్‌ పెట్టకూడదు. వేరే రంగంలో ఉన్న అవకాశాలు, లేదంటే వ్యాపారానికి ఉన్న వనరుల గురించి చెప్పాలె. ఉద్యోగం లేనివాళ్లు బతుకుతున్నరు. తక్కువ జీతంతో ఉద్యోగాలు చేస్తున్నోళ్లూ బతుకుతున్నరు. మరి సాఫ్ట్‌‌వేర్‌‌, ఐటీ ఫీల్డ్‌ ఎంప్లాయిస్‌ ఎందుకంత పిరికి వాళ్లవుతున్నరు. కష్టాలు ఎంతో మందికి ఉన్నయ్‌. అయినా ఇట్ల ఆరోగ్యం పాడుచేసుకోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఉద్యోగం పోవడం ఒక్కటే కాదు. దాని వెనుక ఇంకొన్ని కారణాలుంటయ్‌ . ఒక జాబ్​ పోతే ఏమవుతది. దాని వెనుక వంద అవకాశాలుంటయ్​.

సక్సెస్‌ కాకపోతే ఏం చేయాలె..
హై శాలరీ తీసుకునే కార్పొరేట్ ఉద్యోగులు జాబ్‌ పోతే అవమానంగా ఫీలవుతున్నరు. ఇది ఒక్క నెల రోజులో ఏర్పడ్డ భావన కాదు. ఎన్నో ఏళ్లుగా వాళ్ల బుర్రలో నాటారు. ఫ్యామిలీకి ఆ వ్యక్తిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ‘నాన్‌‌ ఫెర్ఫార్మర్‌‌’ అనగానే ఇంట్లో, ఆఫీసులో ఏమనుకుంటరో అని క్షోభకు గురవుతున్నరు. చిన్నప్పటి నుంచి ‘నువ్వు సక్సెస్‌ కావాలె. అది సాధిస్తేనే విలువ. లేకుంటే వేస్ట్​’ అని చెప్పి బాధను పెంచుతరు. అవి అందుకోలేనప్పుడు ‘నేను అన్‌‌ ఫిట్‌ ’ అనే భావనలోకి పోతున్నరు. అందరూ సక్సెస్‌ కావాలనె చెబుతరు. కానీ, సక్సెస్‌ కాకపోతే ఏం చేయాలో ఎవరూ ఎవరికీ చెప్పరు. అది చెప్పగలిగితేనే ఉద్యోగం పోయినప్పుడు ఏ సమస్యలూ రావు.
– సి. వీరేందర్‌ , సైకాలజిస్ట్