రాహుల్ పరువు నష్టం కేసు.. ఎప్పుడు ఏం జరిగిందంటే..

రాహుల్ పరువు నష్టం కేసు..  ఎప్పుడు ఏం జరిగిందంటే..
  • పరువునష్టం కేసులో.. రాహుల్‌‌కు  ఊరట
  • రాహుల్‌‌కు గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎలాంటి కారణాలు చెప్పలే
  • దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేస్తున్నట్లు ప్రకటన
  • వెంటనే లోక్‌‌సభ స్పీకర్‌‌‌‌ను కలిసిన అధిర్ రంజన్ చౌధురి
  • రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి
  • ఎల్లప్పుడూ సత్యమే విజయం సాధిస్తుంది: రాహుల్‌‌ గాంధీ

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో రాహుల్‌‌కు గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎలాంటి కారణాలు చెప్పలేదని వ్యాఖ్యానించింది. దీంతో రాహుల్‌‌ను దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పును వెలువరించగానే కాంగ్రెస్‌‌ లోక్‌‌ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి.. స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. మరోవైపు సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందని రాహుల్‌‌ గాంధీ అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.

‘మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యలకు 2019లో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన గుజరాత్‌‌‌‌లోని సూరత్ కోర్టు.. రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు చెప్పింది. దీన్ని హైకోర్టులో రాహుల్ అప్పీల్ చేయగా చుక్కెదురైంది. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్​, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌.. కీలక ఉత్తర్వులు వెలువరించింది. రాహుల్‌‌‌‌కు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై స్టే ఇచ్చింది. ‘‘ఇండియన్ పీనల్ కోడ్‌‌‌‌లోని సెక్షన్ 499 (పరువు నష్టం) కింద శిక్షార్హమైన నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. కానీ ట్రయల్ జడ్జి రెండేండ్ల గరిష్ఠ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. గతంలో ధిక్కార కేసులో రాహుల్‌‌‌‌ను సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయాన్ని తప్ప.. ఇంకే కారణాన్ని కూడా జడ్జి చూపలేకపోయారు. ట్రయల్ జడ్జి విధించిన ఈ గరిష్ఠ శిక్ష కారణంగానే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు అమలులోకి వచ్చాయి. శిక్ష ఒక్క రోజు తక్కువగా ఉన్నా.. నిబంధనలు వర్తించేవి కావు. ట్రయల్ కోర్టు జడ్జి ఈ గరిష్ఠ శిక్ష విధించడానికి కొన్ని కారణాలను సూచించాల్సింది. శిక్షపై స్టేను తిరస్కరించేందుకు అప్పిలేట్ కోర్టు, హైకోర్టు భారీగా పేజీలను ఖర్చు చేశాయి. కానీ పైన మేం పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు’’ అని చెప్పింది.

నియోజకవర్గ ప్రజలపైనా ప్రభావం

‘‘రాహుల్‌‌‌‌ గాంధీని దోషిగా నిర్ధారించడం, అనర్హత వేటు వేయడం వల్ల.. ప్రజా జీవితంలో కొనసాగే ఆయన హక్కుపై ప్రభావం పడింది. అంతే కాదు.. తమ నియోజకవర్గానికి (వయనాడ్) ప్రాతినిధ్యం వహించడానికి ఆయనను ఎన్నుకున్న ఓటర్లను కూడా ప్రభావితం చేసింది’’ అని సుప్రీం కోర్టు చెప్పింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవనడంలో ఎలాంటి సందేహమూ లేదని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, గరిష్ట శిక్షను విధించడానికి ట్రయల్ జడ్జి ఎలాంటి కారణం చూపలేదన్న విషయాన్ని గుర్తించి.. తుది తీర్పు వెలువడే వరకు శిక్ష అమలుపై స్టే విధించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఫిర్యాదుదారు పూర్ణేశ్ మోదీ తరఫున మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.

సభ్యత్వం పునరుద్ధరిస్తరా?

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాహుల్ లోక్‌‌‌‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు మార్గం సుగమైంది. తీర్పును అనుసరించి.. రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌ పునరుద్ధరించవచ్చు. లేదా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ను రాహుల్ కోరవచ్చు. అయితే రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు లోక్‌‌‌‌సభ సెక్రటేరియెట్ ఎంత సమయం తీసుకుంటుంది? మంగళవారం అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ పాల్గొంటారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తన శిక్ష అమలుపై స్టే విధించారని, ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ లోక్‌‌‌‌సభ సెక్రటేరియెట్‌‌‌‌ను రాహుల్ ఆశ్రయించవచ్చు. అలానే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని అందజేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత లోక్‌‌‌‌సభ సెక్రటేరియెట్ ఒక ప్రకటన జారీ చేస్తుంది. అయితే సెక్రటేరియెట్ ఇందుకు ఎంత సమయం తీసుకుంటుందనేది ఆసక్తికరం. ఎన్సీపీ ఎంపీ మొహ్మద్ ఫైజల్‌‌‌‌ ఘటనే ఇందుకు ఉదాహరణ. ఫైజల్‌‌‌‌పై పడిన శిక్ష అమలుపై స్టే విధిస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చిన రెండు నెలల తర్వాత గత మార్చిలో ఆయన సభ్యత్వాన్ని లోక్‌‌‌‌సభ సెక్రటేరియెట్ పునరుద్ధరించింది. అది కూడా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంలో ఆలస్యం చేస్తున్నారంటూ ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను సుప్రీం విచారించడానికి కొన్ని గంటల ముందు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు రాగానే.. లోక్‌‌‌‌సభ స్పీకర్ వద్దకు కాంగ్రెస్ వెళ్లింది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరింది.

ఈ రోజు కాకపోతే రేపు.. సత్యం గెలుస్తది: రాహుల్ 

సత్యమే విజయం సాధిస్తుందని రాహుల్‌‌‌‌ గాంధీ అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సుప్రీం తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు కాకపోతే రేపు.. లేదా ఎల్లుండి.. అన్నివేళలా సత్యమే గెలుస్తుంది. ఏదేమైనా నా దారి స్పష్టం. నేనేం చేయాలి, నా బాధ్యతలేంటనేది నాకు స్పష్టత ఉంది. మాకు సాయంగా నిలిచిన వారికి, ప్రజల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని అన్నారు. 

గాంధీభవన్‌‌‌‌లో సంబురాలు

శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌‌‌‌లో నేతలు క్రాకర్స్ కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కుట్రలు చిత్తు అయ్యాయని, న్యాయం గెలిచిందని పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కుట్రపూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమని మండిపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి తదితరులు కూడా రాహుల్‌‌‌‌కు మద్దతుగా ప్రకటనలు విడుదల చేశారు.

ఎప్పుడు ఏం జరిగిందంటే..

2019 ఏప్రిల్ 13: కర్నాటకలోని కోలార్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలందరికీ ‘మోదీ’ అనే కామన్ ఇంటి పేరు ఎందుకు ఉంది?” అని ప్రశ్నించారు. 
2019 ఏప్రిల్ 15: సూరత్‌‌‌‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్‌‌‌‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు. 
2019 జులై 7: సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట రాహుల్ తొలిసారి హాజరయ్యారు. 
2023 మార్చి 23: పరువునష్టం కేసులో రాహుల్ తప్పు చేసినట్లు నిర్ధారిస్తూ.. ఆయనకు రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది.  
2023 మార్చి 24: రెండేండ్ల జైలుశిక్ష పడినందుకు రాహుల్‌‌‌‌ ఎంపీగా అనర్హత వేటుకు గురయ్యారు.
2023 ఏప్రిల్ 2: సూరత్ కోర్టు తీర్పును సెషన్స్‌‌‌‌ కోర్టులో రాహుల్ సవాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా అక్కడ పెండింగ్‌‌‌‌లో ఉంది. 
2023 ఏప్రిల్ 20: రాహుల్‌‌‌‌కు బెయిల్‌‌‌‌ ఇచ్చిన సెషన్స్ కోర్టు.. తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. 
2023 ఏప్రిల్ 25: కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును రాహుల్ఆశ్రయించారు. 
2023 జులై 7: రాహుల్ అభ్యర్థనను హైకోర్టు డిస్మిస్ చేసింది.
2023 జులై 15: గుజరాత్‌‌‌‌ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.   
2023 జులై 21: గుజరాత్ మంత్రి పూర్ణేశ్‌‌‌‌ మోదీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. 
2023 ఆగస్టు 4: రాహుల్‌‌‌‌కు విధించిన జైలు శిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే.