మహిళలకు భద్రత లేని నగరాలివే!

మహిళలకు భద్రత లేని నగరాలివే!

అది పబ్లిక్ ప్లేసే. చుట్టూ జనం ఉంటరు. రోడ్లపై వందలాది వాహనాలూ తిరుగుతనే ఉంటయి. కానీ.. ఆటోలో ఉన్నా, బస్సులో ఉన్నా.. చివరికి సొంత వెహికిల్ పై ఉన్నా సరే.. అది రోడ్డయితే చాలు.. ఏ వైపు నుంచి ఏ మృగాడు మీదపడ్తడో అని ఆడపిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కాలమిది. మధ్యప్రదేశ్​లోని భోపాల్, గ్వాలియర్, రాజస్థాన్​లోని జోధ్​పూర్ నగరాల్లో ఈ భయం ఇంకా ఎక్కువగా ఉందట. ఆడపిల్లలు బయటకెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయట. కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (కోయికా), ఎన్జీవో ఏషియా ఫౌండేషన్ సంస్థలు సర్వే చేసి ఈ విషయాన్ని చెబుతున్నాయి.  ఈ మూడు నగరాల్లో జరిగిన 219 సర్వేల సమాచారాన్ని విశ్లేషించిన ఈ సంస్థలు ఇటీవల ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ మూడు నగరాల్లో జన సంచారం తక్కువగా ఉండే ప్రదేశాలు, సురక్షితం కాని ఏరియాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఇక్కడి మహిళలు తీవ్ర అభద్రతను ఫీలవుతున్నారని ఈ నివేదిక తెలిపింది. బస్సులు, షేరింగ్ ఆటోల్లో వెళుతున్నప్పుడు స్టూడెంట్లు, పెళ్లికాని యువతులను ఎక్కువగా ఈవ్​టీజింగ్ చేస్తున్నారని పేర్కొంది. మొత్తంగా స్కూలు, కాలేజీ అమ్మాయిలు, పెళ్లికాని యువతులకు ఈ నగరాల్లో లైంగిక వేధింపుల ముప్పు చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

నివేదికలోని కీలక అంశాలు ఇవే..

  • భోపాల్, గ్వాలియర్, జోధ్​పూర్ సిటీల్లో జనసంచారం తక్కువగా ఉండి, భద్రంగా లేని ఏరియాలు ఎక్కువగా ఉన్నాయని, వెళ్లాలంటేనే భయమేస్తోందని 89% మంది మహిళలు చెప్పారు.
  • పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​కు  చెందిన బస్సుల్లోనూ కొన్నిసార్లు జనం ఎవరూ ఉండటం లేదని, అలాంటి సమయంలో చాలా భయమేస్తోందని 63% మంది చెప్పారు.
  • డ్రగ్స్ దందాలు, వైన్ షాపులు నిర్వహించే ప్రాంతాలకు వెళ్లాలన్నా టెన్షన్ పడాల్సి వస్తోందని 86% మంది వెల్లడించారు.
  • చాలా ఏరియాల్లో భద్రత లేదని అటువైపు వెళ్లేందుకే జంకుతున్నామని 68% మంది తెలిపారు.
  • ఈ మూడు సిటీల్లో గర్ల్​ స్టూడెంట్లకు 57.1%, పెళ్లికాని యువతులకు 50.1% లైంగిక వేధింపుల ముప్పు ఎక్కువగా ఉంది.
  • అమ్మాయిలపై కామెంట్లు చేయడం, ఈలలు వేయడం, వెకిలిగా చూడటం, అసభ్యంగా తాకడం వంటి చర్యలకు పాల్పడుతున్నా, అధికారులు సీరియస్ లైంగిక దాడులుగా చూడట్లేదు.
  • పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​లో ప్రయాణిస్తున్నప్పుడు వేధింపులు కామన్​అయిపోయాయని 50%  మంది, మార్కెట్ ప్రాంతాల్లో వేధింపులు ఎక్కువగా ఎదుర్కొన్నామని 39% మంది చెప్పారు.
  • రోడ్డుపై వెళుతున్నప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్నామని 26% మంది, బస్టాపుల్లో నిలబడినప్పుడు వేధిస్తున్నారని16% మంది తెలిపారు.