ఆదాయం పెరుగుతున్నా అవస్థలు తప్పుతలేవు!

ఆదాయం పెరుగుతున్నా అవస్థలు తప్పుతలేవు!
  • నరసింహుడి క్షేత్రంలో అరకొర సదుపాయాలు
  • ఉక్కపోతతో సొమ్మసిల్లిన భక్తురాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రోజురోజుకూ ఆదాయం పెరుగుతున్నా భక్తులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే భక్తుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక నరసింహస్వామిని దర్శించుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఓవైపు ఎండలు మండుతుండడం, దివ్యాంగులకు సరిపడా వీల్ చైర్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు క్యూలైన్లలో తరచూ తోపులాట జరుగుతోంది. కనీసం వీకెండ్ లో సైతం క్యూలైన్లను పర్యవేక్షించేవారు ఉండడం లేదు. ఆదివారం స్వామి ధర్మ దర్శనానికి 4 గంటలు, స్పెషల్​దర్శనానికి 2 గంటల టైం పట్టింది. క్యూలైన్లలో ఉక్కపోత ఎక్కువై హైదరాబాద్ కు చెందిన ఓ భక్తురాలు తూర్పు రాజగోపురం గుండా ఆలయం లోపలికి వెళ్లే మార్గంలో సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను పక్కకు తీసుకెళ్లి ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చారు. వీల్ చైర్లు లేకపోవడంతో ఓ దివ్యాంగురాలిని కుటుంబసభ్యులు భుజాలపై మోసుకెళ్లి దర్శనం చేయించారు. సామాన్య భక్తులను పట్టించుకోకున్నా.. కనీసం వృద్ధులు, దివ్యాంగుల కోసమైనా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు. 

ఒక్కరోజే రూ. 53 లక్షల ఆదాయం

లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. గత ఆదివారం రూ. 50.89 లక్షల ఆదాయం రాగా ఈ వారం రూ.53,30,741 వచ్చాయి. మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభం అయ్యాక స్వామివారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో క్రమంగా ఆలయ నిత్య ఆదాయమే కాకుండా హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది. మే 29న(ఆదివారం) కూడా రికార్డు స్థాయిలో ఆలయానికి రూ.45.50 లక్షల ఇన్ కం వచ్చింది. చివరి మూడు ఆదివారాల నుంచి ఆలయ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ ఆదివారం వచ్చిన ఆదాయంలో అత్యధికంగా కేవలం ప్రసాద విక్రయం ద్వారానే రూ.19,66,890, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.10.65 లక్షలు, కొండపైకి వచ్చే కార్ల ప్రవేశ రుసుంతో రూ.4.75 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5,84,950 ఆదాయం సమకూరింది. అలాగే సువర్ణ పుష్పార్చన పూజల ద్వారా రూ.1,76,232, సత్యనారాయణస్వామి వ్రత పూజలతో రూ.2.15 లక్షల ఇన్ కం వచ్చింది.