కత్తులు తీసేందుకు వైజాగ్‌‌ నుంచి గజ ఈతగాళ్లు

కత్తులు తీసేందుకు వైజాగ్‌‌ నుంచి గజ ఈతగాళ్లు
  • లాయర్ల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
  • పోలీసుల కస్టడీకి నిందితులు కుంట శ్రీను, కుమార్‌‌, చిరంజీవి

పెద్దపల్లి, వెలుగు: లాయర్ల హత్య కేసులో వాడిన కత్తులను సుందిళ్ల బ్యారేజీ నుంచి తీయడానికి వైజాగ్‌‌ నుంచి గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. హత్య చేశాక కత్తులను సుందిళ్ల వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీలో పడేసినట్లు విచారణలో కుంట శ్రీను, చిరంజీవి ఒప్పుకున్నారు. దీంతో ఆ కత్తులను తీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈతగాళ్లు శుక్రవారం జిల్లాకు చేరుకునే అవకాశముంది. మరోవైపు నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌‌లను రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు గురువారం తమ కస్టడిలోకి తీసుకున్నారు. వారం రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతివ్వడంతో వరంగల్‌‌ జైలులో ఉన్న ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. మార్చి 4 వరకు వీళ్లకు కస్టడీలో ఉంటారు. కాగా, వామన్‌‌రావు కుటుంబీకులను పరామర్శించడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి ఈ నెల 27న పెద్దపల్లి జిల్లాకు వెళ్లనున్నారు. కల్వచర్ల వద్ద హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాక గుంజపడుగుకు ఉత్తమ్‌‌ వెళ్తారు.

పోలీసుల అదుపులోనే కత్తులు తయారుచేసినోళ్లు

హత్యకు వాడిన కత్తులు తయారు చేసిన రఘు, శ్రీను, బాబులను ఈనెల 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు వాళ్లు పోలీసుల అదుపులోనే ఉండటంతో వాళ్ల కుటుంబీకులు అందోళన చెందుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న గుంజపడుగు గ్రామానికి చెందిన ఊదరి లక్ష్మయ్యను గురువారం చూపిస్తారని భావించగా పోలీసులు చూపించలేదు. గుంజపడుగులో శ్రీరామస్వామి, గోపాలస్వామి ఆలయానికి సంబంధించి కొత్త కమిటీ వేయడం హత్యకు కారణమై ఉండొచ్చని ఆ కొత్త కమిటీ సభ్యులనూ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.