దలాల్​స్ట్రీట్​లో యూత్​ హవా​!

దలాల్​స్ట్రీట్​లో యూత్​ హవా​!
  •     కరెక్షన్ సమయంలోనూ బయింగ్​
  •     దీంతో మార్కెట్లకు మేలు​

న్యూఢిల్లీ: సింపుల్​గా చెప్పాలంటే రెండేళ్ల క్రితం వరకు వాళ్లంతా దలాల్ ​స్ట్రీట్​లో​ బచ్చాగాళ్లు! స్టాక్​మార్కెట్లో ఓనమాలు దిద్దుతున్న వాళ్లు! ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయ్​. యంగ్​ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇండియన్​ మార్కెట్లకు కీలకంగా మారారు. కష్టకాలంలో ఫారిన్​ ఇన్వెస్టర్లను మార్కెట్​ను వదిలేసి వెళ్లిపోతే ఆదుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది 25 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లని సెబీ లెక్కలు చెబుతున్నాయి. కరోనా సమయంలో ఏమీ తోచక డీమాట్ అకౌంట్లు తెరిచారు. లోతుగా స్టడీ చేసి మార్కెట్లను అర్థం చేసుకున్నారు. కరెక్షన్​ వచ్చినప్పుడు కూడా భయపడకుండా షేర్లు కొన్నారు. మార్కెట్​ అప్​ట్రెండ్​లోకి రాగానే వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.  సెన్సెక్స్​ వెయ్యి పాయింట్లు పడ్డప్పుడు కూడా మెజారిటీ యంగ్​ ఇన్వెస్టర్లు భయపడలేదు. తక్కువ ధరలు ఉన్నప్పుడు కొని ఎక్కువ కాగానే ప్రాఫిక్​ బుక్​ చేసుకున్నారు. ఈటీఎఫ్​లలోనూ భారీగా ఇన్వెస్ట్​ చేశారు. డిస్కౌంట్లు, ఆఫర్ల కోసం చాలా డీమాట్​ అకౌంట్లు వాడుతూ సీనియర్​ ఇన్వెస్టర్లే  ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. మార్కెట్లో భారీ కరెక్షన్​ వచ్చిన సమయంలో ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డా, యంగ్​స్టర్లు మాత్రం పెట్టుబడులను వెనక్కి తీసుకోలేదు. దీనివల్ల మార్కెట్​ అదుపు తప్పలేదు. చాలా మంది యంగ్​స్టర్లు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఇన్వెస్ట్​ చేస్తున్నారు. ఇంతటి కష్టకాలంలోనూ మార్కెట్లు భారీగా నష్టపోకపోవడానికి.. వీళ్ల ఇన్వెస్ట్​మెంట్లే కారణమని స్టాక్​బ్రోకర్లు చెబుతున్నారు. కొత్త డీమాట్​ అకౌంట్లలో 45 శాతం యువతవే ఉన్నాయి.   ‘‘యంగ్​ ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగే కొద్దీ రిటైల్ ఇన్వెస్టింగ్​పద్ధతులు మారుతున్నాయి. వీళ్లు బ్లూచిప్​ షేర్లులో డబ్బు పెడుతున్నారు కాబట్టి భయపడట్లేదు. వీళ్లు పాత పద్ధతులను వదిలేసి సొంతగా రీసెర్చ్ చేసుకుంటున్నారు. టిప్స్​, పుకార్ల ఆధారంగా ఇన్వెస్ట్​ చేయడం లేదు. పెన్సీ స్టాక్స్​ను పట్టించుకోవడం లేదు”అని ఏంజిల్​వన్​ బ్రోకింగ్​కు చెందిన ప్రభాకర్​ తివారీ వివరించారు. మ్యూచువల్​ ఫండ్లలోనూ యంగ్​స్టర్ల ఇన్వెస్ట్​మెంట్లు పెరుగుతున్నాయని బ్రోకరేజీలు చెబుతున్నాయి.

మార్కెట్​ను కాపాడుతున్నారు...

ఫారిన్​ ఇన్వెస్టర్లు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో దాదాపు రూ.69 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేసినా మార్కెట్​కొంతమేర మాత్రమే నష్టపోయింది. యంగ్​ ఇన్వెస్టర్ల మద్దతుతో సముద్రపు అలలా తిరిగి పైకిలేస్తోంది. బలమైన పోర్ట్​ఫోలియో లేకున్నా రిటైల్​ ఇన్వెస్టర్లు గత రెండేళ్లలో భారీగా లాభాలు సంపాదించారని మోతీలాల్​ ఓస్వాల్​ ఫైనాన్షియల్​సర్వీసెస్​కు చెందిన సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. సెబీ కూడా రూల్స్​ను మార్చడం వల్ల లీవరేజ్​ పొజిషన్లు తగ్గాయని, ఫలితంగా ఇన్వెస్టర్లలో భయం పోయిందని అన్నారు. కొత్త ఇన్వెస్టర్లు కూడా ట్రేడ్లలో సాహసాలు చేస్తున్నారని ఖేమ్కా మెచ్చుకున్నారు. డిసెంబర్ 2019 చివరి నాటికి, భారతీయ స్టాక్ మార్కెట్లలో కేవలం 3.93 కోట్లు డీమాట్ ఖాతాలు ఉండేవి కానీ మే 2020 నాటికి, ఈ సంఖ్య 4.2 కోట్లకు పెరిగింది.  మే 2021 నాటికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ , సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ డిపాజిటరీల దగ్గర దాదాపు ఆరు కోట్ల ఖాతాలు ఉన్నాయి.  ఫిబ్రవరి 2022 నాటికి   దాదాపు 8.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. స్మార్ట్​ఫోన్​ ద్వారానే డీమాట్​ ఖాతాలు తెరిచే అవకాశం ఉండటంతో ఒక్కొక్కరు రెండుమూడు ఖాతాలు తెరుస్తున్నారు.  ఎక్కువ ఇన్వెస్ట్​మెంట్​ స్ట్రాటజీలను అమలు చేస్తున్నారు.