అసోం వరదల్లో చిక్కుకున్న 6 లక్షల మంది

 అసోం వరదల్లో చిక్కుకున్న 6 లక్షల మంది

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 31 జిల్లాల్లో 6 లక్షల 80 వేల మంది వరదల్లో చిక్కుకొని అల్లాడుతున్నారు. నాగాన్, హొజాయి, కచార్, దరాంగ్, మారిగావ్, కరీంగంజ్ జిల్లాల్లో వరద ఇంకా కొనసాగుతోంది. కొండ చరియలు విరిగి పడి చనిపోయిన వారి సంఖ్య 18 కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల జంతువులు వరద ప్రభావానికి గురయ్యాయి. 2 వేల 248 గ్రామాల్లో 2 లక్షల 31  వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కట్టలు, రోడ్లు, వంతెనలు, ఇళ్లు, మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు అధికారులు. దీమా హసావో జిల్లాలో జటింగా - హరంగా జావో మధ్య దెబ్బతిన్న రోడ్డును వారం రోజుల్లో పునరుద్ధరిస్తామన్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. 


వరదలతో కొండ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వీలైనంత త్వరగా ఈప్రాంతాల్లో  సమాచార వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పారు అధికారులు. వరదలతో పాటు కొండ చరియలు విరిగిపడడంతో ట్రాకులు దెబ్బతిన్నాయి. కొండ ప్రాంతాలకు వారం రోజులుగా రైళ్లు నిలిచిపోయాయి.  కొండ చరియలు విరిగిపడడంతో లుమ్ డింగ్ - బాదర్ పూర్ హిల్ సెక్షన్ లో కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల గమ్య స్థానాలను కుదించారు.


రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 282 పునరావాస కేంద్రాల్లో దాదాపు 75 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. ఆర్మీ, SDRF, NDRF తో పాటు వాలంటీర్లు  వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు 24 వేల 749 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి హెలికాప్టర్లు, బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే చాలా మంది తమ ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడడం లేదన్నారు NDRF అధికారులు. అలాంటి వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని చెప్పారు.