కేసీఆర్ ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తుండు

కేసీఆర్ ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తుండు
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

హైదరాబాద్: త్యాగాల పునాదులతో వచ్చిన రాష్ట్రంలో ప్రజలను కేసీఆర్ బిచ్చగాళ్లుగా మారుస్తుండు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఇప్పటికే దళిత సీఎం అని మోసం చేసిండు, డిప్యూటీ సీఎం అని తాటికొండ రాజయ్య ను మోసం చేసిండు, దళిత ఎమ్మెల్యే సంపత్ ను సస్పెండ్ చేసిండు అని ఆయన గుర్తు చేశారు. శనివారం ఖైరతాబాద్ నియోజవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ జరిగింది. 
ఈ సందర్భంగా దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ తాజాగా సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నాడని విమర్శించారు. చాపలకు ఏర వేసినట్లు ఓట్లకోసమే దళిత బంధు ఎరవేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లని, నిరుద్యోగులకు ఉద్యోగాలని, పిల్లలకు కేజీ టు పీజీ అని మోసం చేసిండు, దళిత, గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామని మోసం చేసిండు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించకుండా, వున్న నిధులను పక్కదారి పట్టించి మోసం చేసిండన్నారు. రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధుల కోసం  8.10లక్షల మంది లబ్దిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు వరద సాయం 10వేలు ఇస్తా అని మోసం చేసిండని ఆయన విమర్శించారు. పోడు వ్యవసాయం చేసే వారిపై దాడులు చేయించడమే కాదు..  నేరెళ్ల ఘటన లో దళితులపై దాడులు చూపించిన ఘనత కూడా కేసీఆర్ దేనని ఆయన నిప్పులు చెరిగారు. మహిళా సంఘాలకు నిధులు ఇవ్వకుండా మోసం చేశాడని.. ఖైరతాబాద్ లో దళిత బంధు ఇవ్వకుంటే.. కేసీఆర్ కు, ఎమ్మెల్యే దానం నాగేంద్రకు కర్ర కాల్చి వాత పెడ్తామ్ అని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. 
అన్ని కులాలను కేసీఆర్ మోసం చేసిండు
మాజీ మంత్రి ప్రసాద్ మాట్లాడుతూ ఒక్క దళితులే కాదు రాష్ట్రంలో అన్ని కులాలను కేసీఆర్ మోసం చేసిండన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తే.. దాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేసిండు, ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చాడని, దమ్ముంటే అన్ని కులాలకు బంధు ఇవ్వు, అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తదని మాజీ మంత్రి ప్రసాద్ స్పష్టం చేశారు. 
ఎన్నికల కోసమే కేసీఆర్ కొత్త డ్రామా
ఎన్నికల కోసమే కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నాడని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ విమర్శించారు. రాష్ట్రంలో 67 లక్షల మంది దళితులున్నారని, 7ఏళ్లలో కేసీఆర్ దళితులకు ఏం చెయ్యలేదన్నారు. దళిత యువతకు కనీసం చేయూత ఇవ్వని కేసార్ హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం కొత్త డ్రామా మొదలుపెట్టాడని ఎద్దేవా చేవారు. దళితులను ఎన్నికల్లో ఓట్ల కోసమే వాడుకుంటుండని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు, యువతకు లోన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినం, మురికి వాడలను, బస్తీలను అభివృద్ధి చేసినం అని ఆయన వివరించారు.