కొత్తగా 225 వైన్స్​! 

కొత్తగా 225 వైన్స్​! 

ఆమ్దానీ పెంచుకునేందుకు సర్కార్​ కసరత్తు
ఆదాయమే లక్ష్యంగా వైన్​ షాపులను పెంచేందుకు సర్కార్​ కసరత్తు చేస్తోంది. షాపుల లైసెన్స్​ ఫీజులతో పాటు అప్లికేషన్​ చార్జీలనూ భారీగా పెంచేందుకు ప్లాన్​ చేస్తోంది. వాటి ద్వారా రూ.6 వేల కోట్లు రాబట్టాలని టార్గెట్​ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 225 మద్యం షాపుల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 
వైన్స్​, బార్ల లైసెన్సుల్లో ఈసారి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లనూ ఇవ్వాలని సర్కార్​ నిర్ణయించినట్టు సమాచారం.


హైదరాబాద్​, వెలుగు: ఆదాయమే లక్ష్యంగా వైన్​ షాపులను పెంచేందుకు సర్కార్​ కసరత్తులు చేస్తోంది. షాపుల లైసెన్స్​ ఫీజులతో పాటు అప్లికేషన్​ చార్జీలనూ భారీగా పెంచేందుకు ప్లాన్​ చేస్తోంది. వాటి ద్వారా రూ.6 వేల కోట్ల రాబడిని రాబట్టేందుకు టార్గెట్​గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.  అధికారులు ఇప్పటికే ఆ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 225 మద్యం షాపుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వైన్స్​, బార్ల లైసెన్సుల్లో ఈసారి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లనూ ఇవ్వాలని సర్కార్​ నిర్ణయించినట్టు సమాచారం. 
జనం లెక్కను బట్టి ఫీజు
ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌తో మద్యం పాలసీ గడువు తీరిపోనుంది. అందులో భాగంగానే కొత్త మద్యం పాలసీకి ప్రపోజల్స్​సిద్ధం చేయాల్సిందిగా ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ను సర్కార్​ ఆదేశించినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల వద్ద రద్దీ, మద్యానికి ఉన్న డిమాండ్​ను బట్టి కొత్త షాపులను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రపోజల్స్​ రెడీ చేస్తున్నట్టు చెప్తున్నారు. కొత్త మండలాలు, పంచాయతీలు ఏర్పాటవడంతో అక్కడ వైన్స్​షాపులను పెట్టాలని సర్కార్​ భావిస్తోంది. కొత్త పాలసీలో భాగంగా జనాభా లెక్కను బట్టి మద్యం షాపుల లైసెన్స్​ ఫీజులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. 2019కి ముందు 4 శ్లాబులుగా లైసెన్స్​ ఫీజులుండేవి. జనాభాను బట్టి ఆరు శ్లాబులకు మార్చారు. దీంతో ఇప్పుడు జనాభా శ్లాబ్​ల వారీగా ఆ ఫీజులను 15 నుంచి 40 శాతం దాకా పెంచడంపై ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ను సర్కార్​ ఆదేశించినట్టు సమాచారం. సర్కార్​ శ్లాబుల ప్రకారం పంచాయతీల్లో 15 శాతం, మండలాల్లో 25 శాతం, మున్సిపాలిటీల్లో 30 నుంచి 35 శాతం, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో 40 శాతానికిపైగా లైసెన్స్​ ఫీజులను పెంచేందుకు సర్కార్​ రెడీ అయింది. ప్రస్తుతం 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. అదే 5 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, జనాభా లక్ష నుంచి 5 లక్షలున్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, జనాభా 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షల ఫీజులను వసూలు చేస్తున్నారు. 20 లక్షల జనాభా దాటితే రూ.1.10 కోట్ల ఫీజు తీసుకుంటున్నారు.  
టార్గెట్​ డబుల్​
2019లో ఆప్లికేషన్​​ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. అప్పుడు 48,243 ఆప్లికేషన్లు రాగా.. టెండర్​ అప్లికేషన్​ ఫీజుతోనే సర్కార్​కు రూ.972 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, ఈసారి దానికి రెండింతల ఆదాయాన్ని అప్లికేషన్​ ఫీజు ద్వారా రాబట్టాలని సర్కార్​ భావిస్తోంది. ఇక లైసెన్స్​​ఫీజులతో ఏటా రూ.3200 కోట్ల చొప్పున రెండేండ్లలో రూ.6,500 కోట్ల రాబడి కోసం ప్లాన్​ చేస్తోంది. దాంతో పాటు 12 ఏండ్ల తర్వాత తొలిసారి కొత్త లిక్కర్​ షాపులను ఏర్పాటు చేసేందుకు సర్కార్​ సిద్ధమవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో 2,216 మద్యం షాపులుండగా.. మరో 225 షాపుల ఏర్పాటుకు ప్రపోజల్స్​ను సిద్ధం చేస్తున్నారు. ఆ సంఖ్య మరింత పెరిగినా పెరగొచ్చని అధికారులు అంటున్నారు. 


ఎస్సీలకు రిజర్వేషన్​
ఈసారి కూడా లాటరీ విధానంలోనే వైన్​ షాపులకు లైసెన్స్ఇవ్వనున్నారు. అయితే, టెండర్లు సహా ప్రతి దాంట్లోనూ దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఇప్పుడు వైన్స్​లలో 15% రిజర్వేషన్​ను దళితులకు ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎస్టీలకు మరో 6% ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్లికేషన్, లైసెన్స్​ ఫీజుల్లో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదననూ సర్కార్​​పరిశీలిస్తోంది. లాటరీలో వైన్​ షాపు పొందిన దళితులకు దళితబంధు ద్వారా ఇవ్వాలని ఆలోచిస్తోంది.