కాంగ్రెస్​ మీటింగుల్లో కనిపించని సీనియర్లు

కాంగ్రెస్​ మీటింగుల్లో కనిపించని సీనియర్లు
  • అలిగి కొందరు.. ఆగ్రహంతో ఇంకొందరు.. ఆహ్వానం అందక మరికొందరు దూరం 
  • రేవంత్​కు సహకరించని నేతలు .. ఎవరికి వారు సెగ్మెంట్లకు పరిమితం

హైదరాబాద్​, వెలుగు: రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి కొందరు కాంగ్రెస్​ సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలిగి కొందరు.. ఆగ్రహంతో ఇంకొందరు.. ఆహ్వానం అందక మరికొందరు.. ప్రోగ్రాముల్లో కనిపించడం లేదు.  రేవంత్​కు పీసీసీ చీఫ్​ పదవి రాగానే  సీనియర్​ నేత కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇతర సీనియర్లు కూడా అసంతృప్తితో అంతర్గతంగా కామెంట్లు చేశారు. ఈ పరిణామాలను అంచనా వేసిన రేవంత్..  తనకు పదవిని ప్రకటించిన వెంటనే సీనియర్లందరినీ కలుపుకుపోతానని, వాళ్ల సలహాలు తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. అన్నట్లుగానే.. చాలా మంది సీనియర్ల ఇండ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. రేవంత్​ ఎంపిక పట్ల తొలుత తీవ్ర వ్యతిరేకతతో ఉన్న వీళ్లలో కొందరు తర్వాత కొంత చల్లబడ్డట్టు కనిపించింది. కానీ మెజారిటీ నేతలు మాత్రం రేవంత్​ కార్యక్రమాలతో అంటీముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. సీనియర్ల ఈ సహాయ నిరాకరణపై కాంగ్రెస్​లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే తాము ఇలా వ్యవహరించడానికి కారణం రేవంత్​రెడ్డి తీరేనని కొందరు సీనియర్లు అంటున్నారు. పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని చెప్తున్నారు. ప్రతి శనివారం జరిగే పొలిటికల్​ ఎఫైర్స్​ కమిటీ మీటింగ్​కు సీనియర్లను ఆహ్వానించకపోవడంపై వాళ్లు గుర్రుగా ఉన్నారు. 
జగ్గారెడ్డి.. అలా లెటర్​ ఇచ్చి..!
పొలిటికల్​ ఎఫైర్స్​ మీటింగ్​లకు సీనియర్లను ఆహ్వానించాలని గత కమిటీ మీటింగ్​ సందర్భంగా వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మణిక్కం ఠాగూర్​కు  లెటర్​ ఇచ్చారు. మీటింగ్​కు పిలవాల్సిన వాళ్ల పేర్లతో జాబితా కూడా అందజేశారు. సీనియర్​ నేతలు జానారెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్​ అలీ, రేణుకా చౌదరితోపాటు 41 మంది పేర్లు ఆ లిస్టులో ఉన్నాయి. రాజకీయ వ్యవహారాలపై తీసుకునే నిర్ణయాల్లో సీనియర్లు ఉంటే వాళ్ల సూచనలు, సలహాలు పనికొచ్చే అవకాశం ఉంటుందని జగ్గారెడ్డి తన వాదనగా వినిపించారు. నిత్యం గాంధీభవన్​, సీఎల్పీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే జగ్గారెడ్డి ఈ పరిణామం తర్వాత తన షెడ్యూల్​ను  మార్చుకున్నారు. వర్కింగ్​ ప్రెసిడెంట్​గా పార్టీ కోసం పది రోజులు కేటాయిస్తానని, మిగితా 20 రోజులు తాను తన నియోజక వర్గంలో కార్యక్రమాలు చూసుకుంటానని ప్రకటించారు. వాస్తవానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఈ పని ఎప్పటి నుంచో చేస్తున్నారు. 
సెగ్మెంట్లలోనే ఉత్తమ్​, కోమటిరెడ్డి
బ్యాక్​ టు బేసిక్స్​ పేరిట ఉత్తమ్​ కుమార్​ తన నియోజకవర్గంలోని కార్యకర్తల్ని కలిసే పనిలో నిమగ్నమయ్యారు. రేవంత్​ పీసీసీ అధ్యక్షుడయ్యా తానిక గాంధీభవన్​ మెట్లు తొక్కనని చెప్పిన వెంకట్​రెడ్డి ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. తన నియోజకవర్గమైన భువనగిరిలో కార్యక్రమాలకు పరిమితమవుతున్నారు. తమ నియోజకవర్గాల్లో రేవంత్​ వేలు పెట్టే వీలు లేకుండా చేసుకునే ప్లాన్​ కూడా దీని వెనుక ఉన్నట్లు కాంగ్రెస్​ కార్యకర్తలు చెప్తున్నారు. రేవంత్​ పీసీసీ చీఫ్​ అయ్యాక సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఇంత వరకు పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు తనకు పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు రావట్లేదని చెప్పారు.  దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు కూడా సీనియర్లకు ఆహ్వానాలు లేవని చెబుతున్నారు.
లెటర్​ విషయం తెలియదన్న రేవంత్.. మండిపడ్డ జగ్గారెడ్డి
పార్టీ కార్యక్రమాలకు సీనియర్లను ఆహ్వానించాలని జగ్గారెడ్డి అందజేసిన లెటర్​ తన దృష్టికి రాలేదని, ఆ విషయమే తనకు తెలియదని రేవంత్​ రెడ్డి నాలుగైదు రోజుల కింద మీడియాతో అన్నారు. దీనిపై  జగ్గారెడ్డిని వివరణ కోరగా.. ‘‘ఆ రోజు మీటింగ్​కు రేవంత్​ రాకపోతే, సమన్వయకర్త  మహేశ్​ కుమార్​ గౌడ్​కు లెటర్​ అందజేసిన. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​కు కూడా ఇచ్చిన. మీడియాలో వార్తలు వచ్చినయ్​. అయినా ఆయన తనకీ విషయం తెలియదన్నారంటే అబద్ధం ఆడుతున్నట్లే లెక్క. పార్టీ నడిపే వాళ్లు ఇట్లా తెలివి చూపెడ్తే పార్టీకే నష్టం. ఏ మీటింగ్​ గురించి ఎవరికీ ఇన్ఫర్మేషన్​ ఇస్తలేరన్నది వాస్తవం. పేరుకే అందర్ని కలుపుకపోతా అనుడు తప్ప ఆచరణలో లేదు.  ఇలాంటి ధోరణి ఏదో ఒక రోజు పార్టీకి ప్రమాదం తెచ్చిపెడ్తది. తీవ్రంగా నష్టపోతాం” అని మండిపడ్డారు. తామంతా కష్టపడి సంపాదించిన సొమ్ముతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, తమకెవరూ జీతం ఇవ్వడం లేదని, తామెవ్వరికీ నౌకర్లం కాదని తీవ్రంగా స్పందించారు.