ప్రాజెక్టులకు భూములిచ్చి రోడ్డునపడ్డారు

ప్రాజెక్టులకు భూములిచ్చి రోడ్డునపడ్డారు
  • రాష్ట్రంలో ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం లక్షల ఎకరాల భూసేకరణ
  • పరిహారం చెల్లింపులో2013 భూసేకరణ చట్టానికి తూట్లు
  • మార్కెట్​ రేటొకటి.. ఇచ్చేది మరొకటి
  • న్యాయమైన పరిహారం కోసం వేలాది మంది నిర్వాసితుల పోరాటం
  • కోర్టుల్లో కేసులను విత్​డ్రా చేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిళ్లు 
  • ఆవేదనతో ఆత్మహత్యలు..ఆగిపోతున్న గుండెలు

కాళేశ్వరం మొదలుకొని పాలమూరు– రంగారెడ్డి వరకు రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్​ ప్రాజెక్టులు, కాల్వల  కోసం లక్షల ఎకరాల భూములను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం వేలాది మంది నిర్వాసితులను బజారునపడేసింది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల కోసమే దగ్గరదగ్గర లక్ష ఎకరాల భూములను తీసుకొని, అనేక కుటుంబాలను బలవంతంగా ఊళ్ల నుంచి వెళ్లగొట్టింది.  త్యాగధనులు అంటూనే ఆ త్యాగానికి విలువ కట్టడంలో అన్యాయం చేస్తున్నదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు, జాగలు పోయి రోడ్డునపడ్డ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా ఆగం చేస్తున్నది. ఈ చట్టం ప్రకారం మార్కెట్​వ్యాల్యూకు రూరల్​ఏరియాలో నాలుగు రెట్లు, అర్బన్​ ఏరియాలో రెండు రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉన్నా మార్కెట్​వ్యాల్యూలో కనీసం మూడో వంతు కూడా చెల్లించకపోవడంతో నిర్వాసితులు కోర్టుకెక్కారు. ఓ దిక్కు కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే అదేమీ పట్టని ప్రభుత్వం నిర్వాసితుల ఇండ్లను కూల్చి, పొలాలను ముంచి తన పని తాను చేసుకుపోతున్నది. కోర్టు కేసులు విత్​డ్రా చేసుకోవాలని నిర్వాసితులపై  బైండోవర్​ కేసులు పెట్టిస్తున్నది. 

పొలాలకు తొవ్వలు బంజేయిస్తున్నది. ఇండ్లకు కరెంట్ కట్​ చేయిస్తున్నది. ఏండ్లు గడిచినా అటు పరిహారం రాక, ఇటు పునరావాసం లేక ఎందరో మనో వేదనతో గుండెపోటుకు గురైన ప్రాణాలు వదిలారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 

పరిహారం రాక ప్రాణాలు పోతున్నయ్​.

మల్లన్నసాగర్​ రిజర్వాయర్​ నిర్మాణంతో సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లోని ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ఊళ్లలో ఎకరా భూమి రూ. 20 లక్షలకు పైగా పలుకుతోంది.  2013 భూసేకరణ చట్టం ప్రకారం  ఎకరాకు రూ. 80 లక్షలు ఇవ్వాలి. కనీసం రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ ప్రకారం లెక్కకట్టి ఉన్నరేటు రూ. 20 లక్షలైనా వచ్చేలా చూడాలి. కానీ ఎక్కడా రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు మించి ఇవ్వలేదు. దీంతో వేములఘాట్‌‌‌‌లో 250 మంది, ఎర్రవల్లిలో 30 మంది,  ఏటిగడ్డ కిష్టాపూర్‌‌‌‌లో 200 మంది, తొగుటలో 300 మంది, రాంపూర్‌‌లో 80 మంది, లక్ష్మాపూర్‌‌‌‌లో 40 మంది, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 80 మంది, తుక్కాపూర్ లో 100 మంది న్యాయమైన పరిహారం కోసం కోర్టుల్లో కేసులు వేశారు. పరిహారం, ఆర్ అండ్‌‌‌‌ ఆర్ ప్యాకేజీ రాలేదనే బాధతో ఇప్పటివరకు 15 మంది గుండెపోటుతో చనిపోయారు. మర్కుక్  మండలం కొండపోచమ్మ సాగర్‌‌‌‌ ‌‌పరిధిలోని రెండు ఊళ్లకు చెందిన 50 మంది కోర్టుల్లో  కేసులు వేశారు. ఈ కేసులు తేలకముందే ప్రభుత్వం ఇండ్లను కూల్చివేసి రిజర్వాయర్​ను నీటితో నింపింది. నిర్వాసితులను టెంపరరీ కాలనీకి తరలించగా, ముగ్గురు నిర్వాసితులు గుండెపోటుతో చనిపోయారు. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని గుడాటిపల్లిలో 70  మంది రైతులకు చెందిన 200 ఎకరాల భూములను తీసుకున్నారు. వీరు కూడా సరైన పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. భూములుపోవడం, పరిహారం రాకపోవడంతో గ్రామానికి చెందిన ఎల్లయ్య, బద్దం రాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారు. చిన్నకోడూరు మండల పరిధిలో నిర్మిస్తున్న అన్నపూర్ణ రిజర్వాయర్‌‌లో 3 ఊళ్లు మునిగిపోతున్నాయి. కొచ్చగుట్టపల్లిలో 30 కుటుంబాలకు చెందిన సాగుభూములు, ఇండ్లు ముంపునకు గురికాగా పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. 

బైండోవర్​ కేసులు పెడుతున్నరు

పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టు లో వట్టెం రిజర్వాయర్ కింద భూములు పోతున్న వట్టెం, కారుకొండ గ్రామాలకు చెందిన 51 మంది రైతులు తమ 295 ఎకరాలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం  పరిహారం చెల్లించాలని కోర్టులో కేసులు వేశారు. మార్కెట్​లో ఇక్కడి భూముల రేటు ఎకరానికి రూ. 25 లక్షలకు పైగా పలుకుతోంది. కానీ కాన్సెన్ట్ అవార్డ్ అని ఎకరాకు రూ. 5 లక్షల 50 వేలు ఫిక్స్ చేశారు. కోర్టుకు వెళ్లిన రైతులను వ్యవసాయం చేసుకోకుండా ఆఫీసర్లు ఇబ్బందులు పెడుతున్నారు. కేసులు విత్​డ్రా చేసుకోవాలంటూ బైండోవర్ కేసులు బనాయిస్తున్నారు. వట్టెం, కారుకొండ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతులు ఇవ్వట్లేదు. నల్లా కనెక్షన్లు లేవు. చివరికి క్రాప్ లోన్లూ రాకుండా అడ్డుకుంటున్నారని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిహారం కోసం ఎదురుచూసి వట్టెం గ్రామంలో 8 మంది గుండెపోటుతో చనిపోయారు. పాలమూరు–-రంగారెడ్డి లిఫ్టు స్కీంలో భాగంగా 4 రిజర్వాయర్లు, కెనాల్స్​ కోసం ఇప్పటి వరకు 19 వేల ఎకరాల భూమి సేకరించగా, 23 ఊళ్లు  ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటివరకు సగం మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. డిండి లిఫ్ట్​ స్కీం కింద అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, చారకొండ, కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్డండ, ఆమనగల్లు మండలాల్లో 1100 ఎకరాలు సేకరించారు. కానీ ఎవరికీ పరిహారం అందలేదు. ఈ క్రమంలోనే ఉమాపూర్​ గ్రామానికి చెందిన దళిత రైతు బుచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. డిండిచింతపల్లికి చెందిన రైతు తిరుపతిరెడ్డి భార్య కూడా గుండెపోటుతో చనిపోయారు.

ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి

నిజామాబాద్​ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంలో 2014లో నిర్మించిన ఎర్రకుంట ప్రాజెక్టు కింద అభంగపట్నం, అబ్బాపూర్ (ఎం) ఊళ్లకు  చెందిన దాదాపు 60 మంది 20 ఎకరాల భూమిని కోల్పోయారు. వారికి ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చినా అమలు కాలేదు. అబ్బాపూర్ (ఎం) శివారులోని  సర్వే నెంబర్ 90లో సుమారు 47 మంది రైతులకు చెందిన14 ఎకరాలు ముంపునకు గురయ్యాయి.  ప్రత్యామ్నాయంగా భూమి, పరిహారం చెల్లిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మిడ్​మానేర్ ప్రాజెక్టు పరిధిలో 30 ఎకరాలకు పరిహారం అందలేదు. సుమారు 700కు పైగా నోటిఫై కాని ఇండ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. మరో 100 మందికి పైగా ఇండ్ల స్థలాలు రావాల్సి ఉంది. ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని సుమారు 30 మంది నిర్వాసితులు ఇండ్ల పరిహారం తక్కువగా రావడంతో తీసుకోలేదు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం కొండపల్లికి చెందిన పలువురు భూ నిర్వాసితులకు 13 ఏండ్లయినా ప్లాట్లు ఇవ్వలేదు. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు కోరినచోట ప్లాట్లు ఇవ్వాలి. లేదా ప్రస్తుత మార్కెట్​ రేటు ప్రకారం డబ్బులు చెల్లించాలి. 186 మందికి ప్యాకేజీ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, 126 మందికి మాత్రమే ఇచ్చారు. 

నిర్మల్‍ జిల్లా మామడ మండలం పొన్కల్‍లో నిర్మిస్తున్న సదర్మట్‍ బ్యారేజీ కింద పొన్కల్‍, కొత్తూర్‍, కమల్‍కోట, ఆదర్శనగర్​లో 752 ఎకరాలు, జగిత్యాల జిల్లాలోని మూలరాంపూర్‍, ఎల్దండి, కోమటికొల్లాపూర్​లో 350 ఎకరాల భూమి ముంపునకు గురైంది. ఈ బ్యారేజీ పరిధిలోని జగిత్యాల జిల్లా రైతులకు పరిహారం చెల్లించగా నిర్మల్​ జిల్లా రైతులకు ఇంకా రూ. 40 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్​రెడ్డిని రైతులు అడ్డుకోవడంతో వారిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూడేండ్లయినా పరిహారం రాకపోవడంతో రైతులు నెలరోజుల నుంచి ఊరిలో  రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో నృసింహ రిజర్వాయర్ నిర్మాణానికి 5,890 ఎకరాలకుగాను  940 ఎకరాల భూమిని సేకరించారు. బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుడి తండా, చొంగల్ నాయక్ తండా పూర్తిగా మునిగిపోనున్నాయి. ఈ ఊళ్ల పరిధిలో భూమిని సేకరించినా  ఇంకా ఖాళీ చేయించలేదు.  పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదు. తిమ్మాపూర్ ప్రజలు పలుమార్లు ఆందోళన చేశారు. మూడు గ్రామాల పరిధిలో 1,556 కుటుంబాలకు ఆర్ అండ్  ఆర్ ప్యాకేజీలో ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 

కేసులు పెడుతున్రు

మాకున్న 14 ఎకరాల భూమిని పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కింద వట్టెం రిజర్వాయర్​కోసం తీసుకున్నరు. ఇక్కడ ఎకరా రేటు రూ. 25 లక్షలు ఉంది. కానీ ప్రభుత్వం ఎకరాకు రూ. 2.32 లక్షలే ఇస్తమంటున్నది. మేము న్యాయమైన పరిహారం కోసం కోర్టుకు పోయినం. కేసును విత్​డ్రా చేసుకోవాల్నని నా మీద పోలీసులు నాలుగు బైండోవర్​ కేసులు పెట్టిన్రు. మా భూమిలోకి పోకుండా రోడ్డును తవ్వేసిన్రు. సరైన పరిహారం అందడం లేదన్న ఆవేదనతో మా ఊరిలో రాగి మోహన్​ రెడ్డి, బాల్​రెడ్డి, లక్ష్మీ దేవమ్మ, పోలీస్​ లక్ష్మమ్మ, బాలయ్య, పాండుతో పాటు మరో ఇద్దరు గుండెపోటుతో ప్రాణాలు ఇడిసిన్రు. 
- తిరుపతిరెడ్డి, వట్టెం, నాగర్​కర్నూల్​ జిల్లా

పొలం, ఇల్లు పోవడంతో ప్రాణాలిడిసిండు

ఈ ఫొటోలో  ఉన్న రైతు పేరు బానోతు హన్మంతు(35). ఈయనది సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్‌‌‌‌ ముంపు గ్రామం మొగుళ్లచెరువు తండా.  హన్మంతుకు భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లతోపాటు వృద్ధురాలైన తల్లి ఉంది. ఆరేండ్ల కింద కాళేశ్వరం కాల్వ కోసం  హన్మంతుకు చెందిన 2.20 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకున్నది. అది గతంలో గవర్నమెంట్​అసైన్​ చేసిన భూమి అని ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిండు. తీరా మల్లన్న సాగర్‌‌‌‌ ప్రాజెక్టు కింద మొగుళ్లచెరువు తండా ముంపునకు గురవడంతో ఆఫీసర్లు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నరు. గతంలో పొలం పోవడం, ఇప్పుడు ఇల్లు పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఈ మధ్యే హన్మంతు గుండెపోటుతో ప్రాణం విడిసిండు.

నిలువ నీడ లేక ఆగిన గుండె

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి బ్యాలెన్సింగ్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌లో లద్దబండ అనే గ్రామానికి చెందిన 14  ఇండ్లు మునిగిపోయినయ్. 7 నెలల కింద ఆఫీసర్లు 14 కుటుంబాలను ఖాళీ చేయించి దాచారం హైస్కూల్​లో ఉంచిన్రు. పరిహారంతో పాటు డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పిన్రు. ఇటీవల స్కూల్ ఓపెన్​ అయినప్పుడు ఆఫీసర్లు వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు.  దీంతో భార్యాపిల్లలతో ఎక్కడికి పోవాలతో తెలియక ఆ బాధలో బూర్గుల నర్సింగరావు అనే నిర్వాసితుడు స్కూల్​లోనే కుప్పకూలి చనిపోయిండు.

తిరిగి తిరిగి అలసిపోయినం

అభంగపట్నం వద్ద ఎర్రకుంట ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు మా భూములు తీసుకున్నరు. తాతల కాలం నుంచి ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నం. వాటికి బదులుగా వేరేచోట భూమిని ఇస్తమని చెప్పి ఇంకా ఇయ్యలేదు. పరిహారమూ రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయినం. పరిహారమో, భూమో ఇస్తే బతుకుతం.
- భూమయ్య, ఉప సర్పంచ్,   అబ్బాపూర్ (ఎం), నిజామాబాద్​ జిల్లా 

తొవ్వ మూసేసిన్రు

నాకున్న 8 ఎకరాల 20 గుంటల భూమిని వట్టెం రిజర్వాయర్​ కోసం తీసుకున్నరు. ఎకరా రూ. 25 లక్షలు ఉంటే రూ. 3.5 లక్షల చొప్పున ఇస్తమంటున్నరు. కోర్టుకు పోయిన. వాళ్లిచ్చిన పరిహారం తీసుకోలేదని ఆఫీసర్లకు కోపమచ్చింది. పొలానికి పొయ్యే తొవ్వను మూసేసిన్రు. బోర్లు పీకేస్తున్నరు. కరెంట్​ స్తంభాలు కూల్చి, కరెంట్​ లేకుండా చేసిన్రు. పైపులు వేస్తే పోలీసులు తీసేస్తున్నరు. కేసులు పెడుతున్నరు.  
-ఈశ్వర్​రెడ్డి, కారుకొండ, నాగర్​కర్నూల్