గాయపడ్డ తండ్రిని, చూపుకోల్పోయిన తల్లిని 600కి.మీ. సైకిల్‌పై..

గాయపడ్డ తండ్రిని, చూపుకోల్పోయిన తల్లిని 600కి.మీ. సైకిల్‌పై..

ఇటీవల జ్యోతి కుమారి అనే 15 ఏళ్ల బాలిక  తన గాయపడిన తండ్రిని 1,200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి  ఇంటికి సురక్షితం చేర్చిన విషయం తెలిసిందే. ఆ సంఘటన  ప్రపంచ దేశాల ప్రజల్ని, దేశాది నేతల్ని కదిలించింది. ఆమె బలం మరియు ఓర్పుకు ఫిదా అయిన  సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది. ఆమెను ట్రయల్స్ కోసం పిలిచింది.

తాజాగా జ్యోతి ధైర్యాన్ని మరవక ముందే 11ఏళ్ల బాలుడు 600కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కి తన తల్లిదండ్రుల్ని సురక్షితంగా ఇంటికి చేర్చాడు.

బీహార్ అరారియాకు చెందిన దంపతులు ఉత్తర ప్రదేశ్ వారణాసి లో నివసిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా యూపీ నుంచి బీహార్ కు రావాల్సి ఉంది. గాయం కారణంగా కంటి చూపును కోల్పోయిన తల్లిని, మార్బల్ కంపెనీలో పనిచేస్తూ గాయపడ్డ తండ్రిని 11ఏళ్ల బాలుడు తబారక్ స్వగ్రామానికి తరలించాడు. యూపీ నుంచి బీహార్ కు 600కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కుతూ తల్లిదండ్రుల్ని బాలుడు సురక్షితంగా తీసుకువచ్చినట్లు మీడియా సంస్థ దివైర్ కథనాన్ని ప్రచురించింది.

లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉంటే తిండిలేక ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని భయపడ్డాం. కానీ లాక్ డౌన్ సడలింపులతో ధైర్యం తెచ్చుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడ్డాం. తిండి లేక చనిపోతామేమోనని అనుకున్నాం. కానీ రహదారి మార్గంలో ప్రజలు మాకు అండగా నిలిచారు. భోజన సదుపాయం కల్పించారు. 11ఏళ్ల తన కుమారుడైన తబారక్ తమని ఇంటికి తీసుకువచ్చాడని తండ్రి తెలిపాడు. ప్రస్తుతం బాలుడి కుటుంబాన్ని జిల్లా అధికారులు  క్వారంటైన్ లో ఉంచారు.