లంచం ఇవ్వలేదని 75 రోజులు మార్చురీలోనే డెడ్ బాడీ

లంచం ఇవ్వలేదని 75 రోజులు మార్చురీలోనే డెడ్ బాడీ


మీరట్: ఉత్తరప్రదేశ్​లో ఘోరం జరిగింది. కరోనా మృతుడి డెడ్ బాడీ అప్పగించేందుకు డాక్టర్లు రూ.15 వేలు లంచం అడిగారు. చనిపోయిన వ్యక్తి భార్య దగ్గర డబ్బులు లేకపోవడంతో డెడ్ బాడీని 75 రోజులు మార్చురీలోనే ఉంచారు. చివరకు ఈ నెల 2న అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనపై మీరట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. హపూర్ జిల్లాకు చెందిన నరేశ్(28)కు ఏప్రిల్ 10న కరోనా సోకింది. ట్రీట్​మెంట్ కోసం హపూర్​లోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి సీరియస్​గా మారడంతో మీరట్​లోని లాలా లజపతిరాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేశారు. నరేశ్ అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఏప్రిల్ 15న చనిపోయాడు. విషయం తెలిసి ఆయన భార్య గుడియా(27) తన పిల్లలతో కలిసి 700 కి.మి. ప్రయాణించి మీరట్ ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త శవాన్ని ఇవ్వాలని కోరితే డాక్టర్లు రూ.15 వేలు లంచం అడిగారు. ‘‘డబ్బులిస్తేనే డెడ్ బాడీ ఇస్తామని డాక్టర్లు చెప్పారు. అన్ని డబ్బులు నేనెక్కడి నుంచి తెచ్చేది. చేసేదేంలేక తిరిగొచ్చేశా” అని గుడియా వాపోయింది. 

అదంతా అబద్ధం: డాక్టర్లు  

గుడియా చేసిన ఆరోపణలను ఆస్పత్రి మేనేజ్ మెంట్ ఖండించింది. నరేశ్ డెడ్ బాడీ కోసం ఎవరూ రాలేదని, మార్చురీలో స్పేస్ లేక మృతదేహాన్ని హపూర్​కు పంపించామని డాక్టర్ విదిత్ దీక్షిత్ చెప్పారు. అతని ఫ్యామిలీ మెంబర్స్ కోసం వెతికామని హపూర్ పీహెచ్​సీ డాక్టర్ దినేశ్ వివరించారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. పోలీసుల ద్వారా విషయం తెలిసి గుడియా హపూర్​కు వచ్చిందని, ఆమె సమక్షంలోనే అంత్యక్రియలు చేశామని చెప్పారు.