హెలికాప్టర్లే సరిపోయాయి

హెలికాప్టర్లే సరిపోయాయి
  • ఆపరేషన్ సఫేద్ సాగర్ కు 20 ఏళ్లు
  • కార్గిల్ యుద్ధంలో పాక్ పోస్టులను కూల్చేసిన చాపర్లు

కార్గిల్ నుంచి పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ ముగిసి మంగళవారానికి 20 ఏళ్లు నిండాయి. ఈ ఆపరేషన్​లో ఎయిర్​ఫోర్స్​ రెండు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. ఒకటి 15 నుంచి 18 వేల అడుగుల ఎత్తులో హెలికాపర్లను వాడటం, రెండు అత్యంత శక్తిమంతమైన ఆయుధాలు. చాలా మందికి కార్గిల్ యుద్ధంలో హెలికాప్టర్ల వాడకం గురించి పెద్దగా తెలీదు.

కార్గిల్​లో హెలికాప్టర్లు

చలికాలం పూర్తి కావడంతో 1999 మే 8న మన సైనిక బలగాలు కార్గిల్ పోస్టుల వద్దకు తిరిగి కాపలాకు వెళ్లడానికి ప్రయత్నించాయి. ఎదురుదాడి జరగడంతో పోస్టులను పాకిస్థాన్ ఆక్రమించినట్లు అర్థమైంది. వెంటనే ఆ పోస్టులను కూల్చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. కొండ రాళ్లతో కట్టిన ఆ పోస్టులను కూల్చాలంటే బాంబు డైరెక్టుగా వాటిని తాకాలి. అలా చేయాలంటే టార్గెట్ మిస్ కాకుండా ఉండేందుకు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే హెలికాప్టర్లను వాడాలని ఎయిర్ ఫోర్స్ భావించింది. ఫైటర్ జెట్లు సగటున గంటకు 700 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.  పాకిస్థాన్ వద్ద అప్పట్లో సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్స్ (శామ్) ఉన్నాయి. అయితే ఏ సంఖ్యలో ఉండొచ్చన్నది మన ఎయిర్ ఫోర్స్​కు తెలియరాలేదు. శామ్ మిస్సైల్స్ నుంచి తప్పించుకోవడానికి మన ఎయిర్ ఫోర్స్ వద్ద కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టం(సీఎండీఎస్) అనే వ్యవస్థ ఉన్నా చాలా పరిమితం. అప్పటికి కేవలం నాలుగు నుంచి ఐదు సీఎండీఎస్ వ్యవస్థలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాక్ పిట్లను కాపాడే ఆర్మర్ ప్లేట్లు కూడా అదే సంఖ్యలో ఉన్నాయి.

‘ఆపరేషన్ విజయ్’ మొదలైన మరుసటి రోజు

1999 మే 26న రెండు హెలికాప్టర్ మిషన్లు నిర్వహించాలని ఐఏఎఫ్ ప్లాన్ చేసింది. మొదటి మిషన్ లో ఐదు ఎంఐ–17 చాపర్లు, రెండో మిషన్​లో నాలుగు ఎంఐ–17 చాపర్లు ఉంటాయి. ఒక్కో చాపర్ 128 క్షిపణులను తీసుకెళ్తాయి. వీటిలో కొన్ని చాపర్ల వద్ద సీఎండీఎస్ కిట్స్ లేవు. అయినా యుద్ధ క్షేత్రానికి వెళ్లిన పదకొండు ఎంఐ– 17 చాపర్లు క్షిపణులను ప్రయోగించి శత్రు స్థావరాలను ధ్వంసం చేశాయి.  ఇదే టైంలో హెలికాప్టర్ల నుంచి పాక్ సైన్యం దృష్టిని మళ్లించేందుకు వెళ్లిన ఓ మిగ్–27 విమానం కూలిపోయింది. దానిలోని ఫ్లైట్ లెఫ్టినెంట్ కంభంపాటి నచికేత సేఫ్​గా పారాచ్యూట్ తో కిందికి దిగారు. నచికేత ఆచూకీ కోసం స్క్వాడ్రన్ లీడర్ హెచ్.కె.సచ్ దేవా, ఫ్లైట్ లెఫ్టినెంట్ నితిన్ వెల్డ్ తో కూడిన ఓ చీతా హెలికాప్టర్ లేహ్ నుంచి బయల్దేరింది. దాదాపు 20 నిమిషాల పాటు నచికేత కిందికి దిగిన ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. తిరిగి వెళ్లిపోగానే నచికేత కోసం వెతుక్కుంటూ వెళ్లిన స్వ్కాడ్రన్ లీడర్ అజయ్ అహూజా విమానం మిగ్–21ను శామ్  కూల్చేసిందని తేలింది.

దీంతో వాళ్లిద్దరి కోసం రెండు చీతా హెలికాప్టర్లతో వెదకడం మొదలుపెట్టారు. నచికేతను వారం రోజుల తర్వాత పాక్​ విడిచిపెట్టగా, అజయ్ అహూజాను మాత్రం క్రూరంగా చంపేశారు. 1999 మే 28న కూడా ఆరు ఎంఐ–17 చాపర్లతో ఐఏఎఫ్ ఓ మిషన్​ను ప్లాన్ చేసింది. దీనికి 129 హెలికాప్టర్ యూనిట్​కు కమాండర్​గా ఉన్న వింగ్ కమాండర్ అనిల్ సిన్హా నాయకత్వం వహించారు. కానీ ఆపరేషన్​కు బయల్దేరే ముందు రెండు చాపర్లు మొరాయించాయి. దీంతో అనిల్ సిన్హా, స్క్వాడ్రన్ లీడర్ రాజీవ్ పుందీర్ వేరే చాపర్లను తీసుకున్నారు. మొత్తం నాలుగు చాపర్లే ఆపరేషన్​కు బయల్దేరాయి. పుందీర్ చాపర్​ మినహా మూడింట్లోనూ సీఎండీఎస్​ కిట్లున్నాయి.  టొలోలింగ్ ఏరియా కాంప్లెక్సులపై రాకెట్లతో నాలుగు చాపర్లు విరుచుకుపడ్డాయి.

పాక్​ సైనికులు శామ్ మిస్సైల్స్​ను ప్రయోగించారు. మూడు చాపర్లు తప్పించుకున్నాయి. కానీ పుందీర్ చాపర్​ను శామ్ కూల్చేసింది. దానిలోని నలుగురు సైనికులు వీర మరణం పొందారు. వెంటనే ప్లాన్ మార్చిన ఐఏఎఫ్, శామ్ కు అందనంత దూరంలో ఎగురుతూ జీపీఎస్ సాయంతో టార్గెట్లను నేలమట్టం చేయాలని ఫైటర్ జెట్లను ఆదేశించింది. టైగర్​ హిల్స్​ ప్రాంతంలో పాక్​ స్థావరాలను కూల్చేందుకు రాత్రిపూట దాడులు చేయాలని భావించారు. తొలి రోజు దాడులు జరిగినా, ప్రత్యర్థుల దాడిలో చాపర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆపరేషన్​ ఆగిపోయింది. లేజర్​ గైడెడ్​ బాంబులతో దాడులు చేశారు.