చివరి రోజు ఇండియాకు 4 స్వర్ణాలు

చివరి రోజు ఇండియాకు 4 స్వర్ణాలు
  • 22 గోల్డ్‌‌ సహా 61 మెడల్స్‌‌తో ఇండియాకు నాలుగో ప్లేస్‌‌
  • టాప్‌‌ మళ్లీ ఆస్ట్రేలియాదే
  • ముగిసిన కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌

షటిల్‌‌‌‌ సూపర్‌‌ స్టార్‌‌, భారత భాగ్య సింధూరం పీవీ సింధు మెడలో మరో స్వర్ణం చేరింది. ఎన్నో ఘనతలు సాధించిన తన కెరీర్‌‌లో వెలితిగా ఉన్న కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ సింగిల్స్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌ను  సింధు ఎట్టకేలకు సొంతం చేసుకుంది. యంగ్‌‌ సెన్సేషన్‌‌ లక్ష్యసేన్‌‌, డబుల్స్‌‌లో దుమ్మురేపుతున్న సాత్విక్‌‌–చిరాగ్‌‌ షెట్టితో పాటు  వెటరన్‌‌ టీటీ ప్లేయర్‌‌ శరత్‌‌ కమల్ స్వర్ణం అందుకున్నాడు. చివరి రోజు నాలుగు గోల్డ్‌‌, ఒక సిల్వర్​, ఒక బ్రాంజ్​తో కామన్వెల్త్‌‌కు ఇండియా ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చింది. మొత్తంగా 22 గోల్డ్‌‌ సహా 61 మెడల్స్‌‌తో నాలుగో ప్లేస్‌‌ సాధించింది.

బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌: గ్లాస్గోలో బ్రాంజ్​.. గోల్డ్​ కోస్ట్​లో సిల్వర్​. ఇప్పుడు గోల్డ్.  కామన్వెల్త్​ గేమ్స్​ బ్యాడ్మింటన్​ సింగిల్స్​లో తన బంగారు కలను  పీవీ సింధు బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌లో నెరవేర్చుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో  సింధు 21–-15, 21–-13 తో కెనడాకు చెందిన మిషెల్లీ లిని వరుస గేమ్స్‌‌‌‌లో చిత్తు చేసింది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో పదో ర్యాంకర్‌‌‌‌ లక్ష్యసేన్ 19-–21, 21–-9, 21–-16 తో ఎంగ్‌‌‌‌ జె యంగ్‌‌‌‌ (మలేసియా)పై ఉత్కంఠ విజయం సాధించాడు. తొలి గేమ్‌‌‌‌ కోల్పోయినా తర్వాతి రెండు గేమ్స్‌‌‌‌లో తిరుగులేని పెర్ఫామెన్స్‌‌‌‌తో తొలి ప్రయత్నంలోనే గోల్డ్‌‌‌‌ అందుకున్నాడు. మరోవైపు మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి జంట  21-–15, 21-–13 తో  ఇంగ్లండ్‌‌‌‌కు చెందిన బెన్‌‌‌‌ లేన్‌‌‌‌–సీన్‌‌‌‌ మెండీ ద్వయంపై వరుస గేమ్స్‌‌‌‌లో గెలిచి పోటీల్లో ఇండియాకు చివరి స్వర్ణం అందించింది.  మొత్తంగా ఈ ఎడిషన్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌లో ఇండియాకు మూడు గోల్డ్‌‌‌‌ సహా ఆరు పతకాలు లభించాయి. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ దక్కగా.. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జంట బ్రాంజ్‌‌‌‌ సాధించాయి.  ఇక, ఈ మెగా ఈవెంట్‌‌‌‌లో ఇండియా 22 గోల్డ్‌‌‌‌, 16 సిల్వర్‌‌‌‌, 23 బ్రాంజ్‌‌‌‌లతో 61 మెడల్స్‌‌‌‌తో నాలుగో స్థానం సాధించింది. గత ఎడిషన్‌‌‌‌తో మూడో స్థానంలో నిలిచిన ఇండియా 26 గోల్డ్‌‌‌‌ సహా 66 మెడల్స్‌‌‌‌ గెలిచింది. అయితే, ఈసారి షూటింగ్‌‌‌‌ లేకపోవడంతో ఇండియా అవకాశాలను దెబ్బకొట్టింది. మరోవైపు ఆస్ట్రేలియా 67 గోల్డ్‌‌‌‌ సహా 178 పతకాలతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సాధించింది. ఇంగ్లండ్‌‌‌‌ (176), కెనడా (92) టాప్‌‌‌‌–3లో నిలిచాయి.

నొప్పి భరిస్తూనే చిత్తు చేసిన సింధు..

గత ఎనిమిదేళ్లుగా మిషెల్లీతో ఆడిన ప్రతీసారి విజయం సాధిస్తూ వస్తున్న సింధు ఈ సారి కూడా అదే ఫలితాన్ని రిపీట్‌‌‌‌ చేసింది. తుదిపోరులో  సింధు చీలమండ గాయంతో ఇబ్బంది పడింది. నొప్పి భరిస్తూనే తను లీని చిత్తు చేసింది.  ఆరంభంలో నెట్‌‌‌‌కు దగ్గరగా ఆడుతూ లీ పాయింట్లు రాబట్టే ప్రయత్నం చేయగా.. లెఫ్ట్‌‌‌‌ సైడ్‌‌‌‌ స్మాష్‌‌‌‌ కొట్టిన సింధు 7–5తో లీడ్‌‌‌‌లోకి వచ్చింది.  బ్రేక్‌‌‌‌ తర్వాత మూడు పాయింట్లు నెగ్గిన హైదరాబాదీ తర్వాత ఆధిక్యాన్ని 14–8కి పెంచుకుంది. ఈ టైమ్‌‌‌‌లో ఓ ఫోర్‌‌‌‌హ్యాండ్ డ్రాప్‌‌‌‌ షాట్‌‌‌‌తో పాటు వరుసగా రెండు బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ విన్నర్లతో మిషెల్లీ 14–17తో పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, ఆమెకు ఎలాంటి చాన్స్‌‌‌‌ ఇవ్వని సింధు బాడీ స్మాష్‌‌‌‌తో గేమ్‌‌‌‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌‌‌‌ను 4–2 లీడ్‌‌‌‌తో మొదలు పెట్టిన ఇండియా స్టార్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ టైమ్‌‌‌‌కు 11–6తో లీడ్‌‌‌‌ సాధించింది. చివర్లో  ఓ లాంగ్‌‌‌‌ ర్యాలీని మిషెల్లీ ఫోర్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌తో నెగ్గడంతో స్టేడియం హోరెత్తింది. ఆ వెంటనే క్రాస్‌‌‌‌కోర్ట్‌‌‌‌ విన్నర్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ ముగించిన సింధు సంబరాల్లో మునిగింది. 

హాకీలో మళ్లీ రజతమే

మెన్స్‌‌ హాకీలో ఇండియా జట్టు మరోసారి సిల్వర్‌‌తో సరిపెట్టింది. కామన్వెల్త్‌‌లో అత్యంత బలమైన ఆస్ట్రేలియా ముందు మళ్లీ తలొగ్గింది. ఫైనల్లో ఇండియా 0–7 గోల్స్‌‌ తేడాతో ఆసీస్‌‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కంగారూల జోరు ముందు తేలిపోయిన ఇండియన్స్‌‌ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. కామన్వెల్త్‌‌ ఫైనల్లో ఆసీస్‌‌ చేతిలో ఓడటం ఇండియాకు ఇది మూడోసారి. 2010, 2014 ఎడిషన్స్‌‌లోనూ సిల్వర్‌‌తో వెనుదిరిగింది. మరోవైపు ఈ గేమ్స్‌‌లో హాకీని ప్రవేశపెట్టిన 1998 నుంచి ఆస్ట్రేలియానే విజేతగా నిలుస్తోంది.

40 ఏండ్ల శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘కమాల్‌‌‌‌‌‌‌‌’

ఇండియా వెటరన్‌‌‌‌‌‌‌‌ ప్యాడ్లర్‌‌‌‌‌‌‌‌ ఆచంట శరత్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌  నలభై ఏండ్ల వయసులోనూ  బెస్ట్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఏజ్‌‌‌‌‌‌‌‌ కేవలం నంబర్‌‌‌‌‌‌‌‌ మాత్రమే అని చాటి చెప్పాడు. ఇప్పటికే  మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌తో పాటు  మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌లో ఆకుల శ్రీజతో కలిసి గోల్డ్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌లో  సత్యన్‌‌‌‌‌‌‌‌తో సిల్వర్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన అతను సింగిల్స్‌‌‌‌‌‌‌‌లోనూ గోల్డ్‌‌‌‌‌‌‌‌ రాబట్టి ఈ ఆటలో తనకు తిరుగులేదని నిరూపించాడు. ఫైనల్లో తన అనుభవాన్ని రంగరించి ఆడిన శరత్‌‌‌‌‌‌‌‌ 4–1 తో లియాడ్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌)పై ఘన విజయం సాధించి ఈ కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌లో మూడో గోల్డ్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకున్నాడు. 2006 కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో తొలి స్వర్ణం గెలిచిన శరత్‌‌‌‌‌‌‌‌ ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఐదు ఎడిష న్లలో 13 పతకాలు ఖాతా లో వేసుకోవడం విశేషం. ఇక, మరో సీనియర్‌‌‌‌‌‌‌‌ ప్యాడ్లర్‌‌‌‌‌‌‌‌ సత్యన్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో తొలి పతకం నెగ్గాడు.  తను బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ పోరులో గెలిచాడు.