బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇండియా డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్స్ సాత్విక్–చిరాగ్ 21–11, 21–12తో వరల్డ్ 80వ ర్యాంకర్స్ లుమించ్ చె–టాంగ్ కి వీ (చైనీస్ తైపీ)ను వరుస గేమ్స్‌లో చిత్తు చేశారు. ఆటలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఇండియా షట్లర్లు 35 నిమిషాల్లో ప్రత్యర్థుల పని పట్టి ఫైనల్లో అడుగు పెట్టారు.
2019లో ఇదే టోర్నీలో గెలిచి కెరీర్‌లో తొలి సూపర్500 టైటిల్ ఖాతాలో వేసుకున్న సాత్విక్– చిరాగ్ ఆదివారం జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్ సీడెడ్స్ చెన్ బో యాంగ్–లియు యితో అమీతుమీ తేల్చుకుంటారు. కాగా, విమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. టాప్ సీడ్స్ జోంగ్‌కోల్ఫాన్– రవిండ ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) 21–12, 22–20తో ఇండియా జంటను ఓడించి ఫైనల్ చేరుకున్నారు.
