మహిళా సంఘాలకు 41 కోట్లు

మహిళా సంఘాలకు 41 కోట్లు
  • 41 వేల కొత్త డ్వాక్రా గ్రూప్​లకు 41 కోట్లు
  • ఒక్కో సంఘానికి రూ.10 వేల చొప్పున మంజూరు
  • కేంద్రం రూ.25 కోట్లు, రాష్ట్రం రూ.16 కోట్లు జమ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 41 వేల మహిళా పొదుపు సంఘాలకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద రూ.25 కోట్లు విడుదల చేసింది. ఇటీవల ఈ నిధులు విడుదల కాగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.16 కోట్లను కలిపి డ్వాక్రా గ్రూపుల ఖాతాల్లో జమ చేసింది. మహిళా సంఘంలో లేని మహిళలందరినీ చేర్చి లక్ష గ్రూపులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెర్ప్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున 4.10 లక్షల మంది మహిళలతో 41 వేల కొత్త సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాలు పొదుపు డబ్బులు జమ చేయడం, లోన్లు తీసుకోవడంలాంటి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రోత్సాహకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 రేషియోలో రూ.41 కోట్లను విడుదల చేయగా, సెర్ప్ అధికారులు ఇటీవల ఒక్కో గ్రూపు ఖాతాలో రూ.10 వేల చొప్పున జమ చేశారు.