5 ఫోన్లలో మాల్​వేర్​ ఉంది...

5 ఫోన్లలో మాల్​వేర్​ ఉంది...

కమిటీ నివేదికలో పేర్కొందన్న సుప్రీంకోర్టు.. విచారణ 4 వారాలకు వాయిదా

న్యూఢిల్లీ: పెగాసస్​పై ఏర్పాటు చేసిన కమిటీ 29 ఫోన్లను పరీక్షించగా.. వాటిలో 5 ఫోన్లలో మాల్​వేర్​ ఉన్నట్టు గుర్తించిందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఆ మాల్​వేర్​ను పెగాసస్​ స్పైవేర్​ అని నిర్ధారించలేకపోతున్నామని కమిటీ తన నివేదికలో పేర్కొందని తెలిపింది. పెగాసస్​ వ్యవహారంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కమిటీ పేర్కొన్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్​ హిమాకోహ్లీతో కూడిన బెంచ్​ దీనిపై విచారించింది. పెగాసస్​పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు రిటైర్డ్​ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్​ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 3 భాగాలుగా తన రిపోర్ట్​ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. కమిటీ రిపోర్ట్ చాలా పెద్దగా ఉందన్న సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ, దానిలోని కొన్ని ముఖ్యాంశాలను కోర్టులో వెల్లడించారు. టెక్నికల్​ కమిటీ రిపోర్ట్​ను పరిశీలిస్తే కాస్త ఆందోళనకు గురయ్యామని, టెక్నికల్​ కమిటీకి సమర్పించిన 29 ఫోన్లలో ఐదింటిలో ఒకరకమైన మాల్​వేర్​ను గుర్తించారని, అయితే ఇది పెగాసస్​కు సంబంధించినదేనా అనేది కమిటీ నిర్ధారించలేకపోయిందని బెంచ్​ తెలిపింది. ‘‘కమిటీ చెప్పిన ఒక విషయం ఏమిటంటే కేంద్రం తమకు సహకరించలేదని పేర్కొంది. మీరు ఇక్కడ ఎలాంటి స్టాండ్​ తీసుకున్నారో.. అక్కడ కూడా అలాగే వ్యవహరించారు” అంటూ కామెంట్​ చేసింది. పౌరుల గోప్యతను పరిరక్షించడానికి, దేశంలో సైబర్ భద్రతను పెంచడానికి చట్టాన్ని సవరించాలని కమిటీ రిపోర్ట్ సూచించిందని పేర్కొంది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

పెగాసస్​ వివాదం ఏమిటి?

దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లపై కేంద్రం నిఘా పెట్టిందని, ఇందుకోసం ఇజ్రాయెల్‌‌ కు చెందిన ఎన్‌‌ఎస్‌‌వో గ్రూపునకు చెందిన పెగాసెస్‌‌ స్పైవేర్‌‌ను వాడిందని ఆరోపణలు వచ్చాయి. రాహుల్‌‌ గాంధీతోపాటు పలువురు రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, సుప్రీంకోర్టు మాజీ జడ్జీల ఫోన్లను ట్యాప్​ చేశారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్‌‌ను స్తంభింపజేశాయి. ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. చివరికి ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

పీఎంఎల్ఏ తీర్పుపై కేంద్రానికి నోటీసులు

మనీలాండరింగ్‌‌ నిరోధక చట్టానికి(పీఎంఎల్‌‌ఏ) సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులైలో జస్టిస్‌‌ ఖన్విల్కర్‌‌ నేతృత్వంలోని బెంచ్​ ఇచ్చిన పీఎంఎల్ఏ తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్‌‌ నేత కార్తీ చిదంబరం పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ కేస్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ రిపోర్టు అందించకపోవడం, నిర్ధోషిత్వాన్ని తిరస్కరించడం అనే అంశాలపై పీఎంఎల్‌‌ఏ తీర్పును పున:పరిశీలించాలని కోర్టును ఆయన కోరారు. ఈ రెండు అంశాలను పున:పరిశీలించేందుకు సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్​ అంగీకరించింది.

ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో భద్రతా ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు చేసిన కమిటీ.. పంజాబ్‌‌ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేల్చినట్లు సీజేఐ జస్టిస్‌‌ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్​ వివరించింది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఫిరోజ్‌‌పూర్‌‌ సీనియర్‌‌ ఎస్‌‌పీ విఫలమయ్యారని రిటైర్డ్​ న్యాయమూర్తి జస్టిస్‌‌ ఇందు మల్హోత్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీ పేర్కొందని తెలిపింది. భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నా సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని నివేదిక వెల్లడించిందని తెలిపింది. ఇది సెంట్రల్‌‌ ఏజెన్సీల వైఫల్యం కాదని, పంజాబ్‌‌ పోలీస్‌‌ వైఫల్యమేనని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్రానికి పంపుతామని బెంచ్ వెల్లడించింది. ఎన్నికల ర్యాలీ కోసం ఫిరోజ్‌‌పూర్‌‌ వెళుతున్న ప్రధాని మోడీకి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది. దీంతో హుస్సేనివాలా నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న ఫ్లైఓవర్‌‌పై ఆయన 20 నిమిషాలు ఆగిపోవడం దుమారం రేపింది.