8 మంది భారత నేవీ మాజీ ఆఫీసర్లకు మరణశిక్ష నుంచి ఊరట

8 మంది భారత నేవీ మాజీ ఆఫీసర్లకు మరణశిక్ష నుంచి ఊరట

న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణల కేసులో ఖతార్‌‌‌‌లో అరెస్టయి, మరణశిక్ష పడిన 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులకు ఊరట కలిగింది. మరణశిక్షను జైలు శిక్షగా తగ్గిస్తూ ఖతార్ అప్పిలేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నేండ్ల జైలు శిక్ష విధించిందనే వివరాలు తెలియరాలేదు. ఈ తీర్పు పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని భారత విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు లీగల్ టీమ్‌‌‌‌తో, బాధితుల కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నామని వెల్లడించింది. ‘‘బాధితుల కుటుంబ సభ్యులతోపాటు ఖతార్‌‌‌‌‌‌‌‌లో ఇండియా రాయబారి, ఇతర అధికారులు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యారు. మేము మొదటి నుంచి ఈ 8 కుటుంబాలకు అండగా ఉన్నాం. భవిష్యత్తులోనూ న్యాయ సాయం అందిస్తాం’’ అని వివరించింది.  

ఇదీ కేసు.. 

దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్‌‌‌‌ సంస్థ.. ఖతార్‌‌‌‌ ఆర్మ్‌‌‌‌డ్‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌కు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంటుంది. ఇందులో 8 మంది భారత నేవీ మాజీ అధికారులు పని చేసేవారు. 2022 ఆగస్టులో వీరిని అక్కడి అధికారులు గూఢచర్యం ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై మోపిన అభియోగాలు ఏవనేది ఇప్పటికీ బహిరంగపరచలేదు. కానీ ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 8 మందికి  మరణశిక్ష విధిస్తూ ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌‌‌‌స్టాన్స్ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై కోర్ట్ ఆఫ్ అప్పీల్‌‌‌‌ను భారత విదేశాంగ శాఖ గత నెలలో ఆశ్రయించింది. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. 8 మంది విధించిన మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించింది. 

8 మంది వీళ్లే

ఎనిమిది మంది నేవీ మాజీ ఆఫీసర్లలో కెప్టెన్ నవ్‌‌‌‌తేజ్‌‌‌‌ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ట, కమాండర్లు పూర్ణేందు తివారి, అమిత్ నాగ్‌‌‌‌పాల్, ఎస్‌‌‌‌కే గుప్తా, బీకే వర్మ, సుగుణాకర్ పాకాల, సెయిలర్ రాజేశ్ ఉన్నారు.