8 ఏళ్ల బాలుడి ఆకలి చావు: కుటుంబసభ్యుల పరిస్థతి విషమం

8 ఏళ్ల బాలుడి ఆకలి చావు: కుటుంబసభ్యుల పరిస్థతి విషమం

భోపాల్: 72 ఏళ్ల స్వతంత్ర భారతం.. ఓ నిరుపేద కుటుంబంలో ఆకలి చావును చూస్తోంది. రోజుల కొద్దీ తినడానికి తిండి లేక ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ చిన్నారి ఒక్కడే కాదు మొత్తం కుటుంబం పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఓ వైపు తిండి లేక.. మరో వైపు డయేరియాతో ఆస్పత్రిలో ప్రాణాలు నిలుపుకోడానికి పోరాడుతున్నారు.

మధ్యప్రదేశ్ లోని బర్వానీ జిల్లా సెంధ్వా ప్రాంతంలో జరిగిందీ విషాద ఘటన. రతన్ కుమార్ అనే ఓ రోజువారీ కూలీ కుటుంబం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కూలి పనులకు వెళ్లొస్తేనే ఆ రోజు నాలుగు మెతుకులు తినగలిగేది. అటువంటి కుటుంబానికి కొద్ది రోజులుగా పనుల్లేవు. చేతికి రూపాయి ముట్టే దారి లేకుండా పోయింది. ఇంట్లో కనీసం పిల్లలకు వండి పెట్టేందుకు కూడా తిండి గింజలు లేక అంతా పస్తులు పడుకుంటున్నారు.

ఓ వైపు ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబాన్ని డయేరియా రాక్షసిలా పట్టుకుంది. వంతులు, విరేచనాలతో కకావికలం అయిపోయారంతా. అంతా జబ్బు పడడంతో చిన్న పిల్లలకు కూడా అంతో ఇంతో అన్నం పెట్టగలిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొద్ది రోజులుగా ఆకలితో అలమటిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆ కుటుంబంలోని మరో ఐదుగురు కూడా ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారు.

సంక్షేమ పథకాలేవీ అందట్లే..

ఈ నిరు పేద కుటుంబానికి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. ‘కనీసం వారికి రేషన్ కార్డు కూడా లేదు. నెలవారీ రేషన్ సరుకులు కూడా అందడం లేదు’ అని చెప్పారు.

విచారణకు ఆదేశించాం

చిన్నారి మృతిపై విచారణకు ఆదేశించామని బర్వానీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అన్షు జ్వాలా తెలిపారు. వారికి చాలా రోజుల నుంచి కనీసం ఆహారం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కుటుంబ సభ్యులకు సరైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అందకపోవడంపైనా విచారణ జరిపి, బాద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.