శ్రామిక్ ట్రైన్ల‌లో 80 మంది వ‌ల‌స కార్మికుల మృతి

శ్రామిక్ ట్రైన్ల‌లో 80 మంది వ‌ల‌స కార్మికుల మృతి

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాల‌య్యారు. మార్చి 25 నుంచి దేశ‌మంతా లాక్ డౌన్ అమ‌లులోకి రావ‌డంతో అన్ని ర‌కాల ప‌నులు ఆగిపోయాయి. వ‌ల‌స కూలీలుగా ఇత‌ర ప్రాంతాల్లో ప‌ని చేస్తున్న ల‌క్ష‌లాది మంది ఉపాధి కోల్పోయారు. స్వ‌స్థ‌లాల‌కు వెళ్దామంటే ప్ర‌జా ర‌వాణా లేదు. దీంతో ప‌నులు లేక‌.. తిన‌డానికి తిండి లేక.. క‌రోనా భ‌యంతో చావో బతుకో ఎలాగోలా ఇంటికి చేరాల‌న్న త‌ప‌న‌తో వంద‌ల వేల కిలోమీట‌ర్ల దూరం కాలిన‌డ‌క‌నే వెళ్లారు వేలాది మంది కార్మికులు. ఈ వ‌ల‌స జీవుల క‌ష్టాల‌ను చూసి ఎట్ట‌కేల‌కు మే 1 నుంచి వారిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు ప్ర‌త్యేకంగా శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ల‌ను న‌డ‌ప‌డం మొద‌లుపెట్టింది రైల్వే శాఖ‌. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 60 ల‌క్ష‌ల మందిని వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చింది. కానీ దాదాపుగా నెల రోజుల‌పైగా అల‌సిపోయిన వ‌ల‌స జీవులు దుర‌దృష్ట‌వ‌శాత్తు ఈ ట్రైన్ల‌లో స్వ‌స్థ‌లాల‌కు చేరేలోపే కొంత మంది ప్రాణాలు వ‌దిలారు.

మే 9 నుంచి 27 మధ్య 80 మంది మృతి

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు న‌డుపుతున్న శ్రామిక్ రైళ్ల‌లో ప్ర‌యాణిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు 80 మంది మర‌ణించిన‌ట్లు రైల్వే శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మే 9 నుంచి 27వ తేదీ మ‌ధ్య ఈ మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు ఓ అధికారి తెలిపారు. అత్య‌ధికంగా మే 26న 13 మంది వ‌ల‌స కూలీలు శ్రామిక్ ట్రైన్ల‌లో ప్ర‌యాణిస్తూ ప్రాణాలు కోల్పోయారు. మే 23న ప‌ది మంది, మే 24, 25 తేదీల్లో తొమ్మిది మంది చొప్పున వ‌ల‌స కార్మికులు మ‌ర‌ణించారు. అలాగే మే 27న ఎనిమిది మంది వ‌ల‌స జీవులు స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేలోపే మ‌ర్గ‌మ‌ధ్యంలోనే మృతిచెందారు. శ్రామిక్ ట్రైన్ల‌లో ప్ర‌యాణిస్తూ మ‌ర‌ణించిన వారిలో ఒక‌రు క‌రోనా వ‌ల్ల, 11 మంది కోమార్బిబ్ కండిష‌న్స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పో‌యారు. కాగా, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,73,763 కు చేరింది. ఇందులో 82370 కోలుకోగా 86422 మంది చికిత్స తీసుకుంటున్నారు. 4971 మంది కరోనాతో చనిపోయారు.