అదరగొట్టుడు, బెదిరించుడు.. ఇదే కేసీఆర్ పాలన
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, ఆరేళ్లుగా కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. నిజాం పాలనలో- చిద్రమైన తెలంగాణ మాదిరే.. ఇప్పటి ప్రత్యేక రాష్ట్రం కనిపిస్తోందని అన్నారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను కేసీఆర్ 8వ నిజాంలా పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ప్రజాస్వామ్యం కనిపించదని, ప్రజా సంక్షేమం పట్టించుకునే వారే లేరని విమర్శించారు. అదరగొట్టుడు, బెదిరించుడు, అదుపులో పెట్టుకునుడు.. ఇదే కేసీఆర్ గడీల పాలన తీరని ఫైర్ అయ్యారు. భారత్ బంద్ కు మద్దతు తెలిపిన కేసీఆర్, ఢిల్లీలో రైతుల దీక్ష వద్దకు ఎందుకు వెళ్లలేదని, వారి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఢిల్లీలో కాళ్లు పట్టుకోవడం కేసీఆర్‌కు అలవాటే
హైదరాబాద్‌లో అరవడం, ఢిల్లీలో కాళ్లు పట్టుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని విస్మరించి, తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పీవీ నర్సింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు చేసినప్పుడు కూడా ఇలానే విమర్శించారని చెప్పారు. పీవీ ఆర్థిక సంస్కరణలు అమలు చేయకపోతే ఇప్పుడు ఇండియా ఆర్థిక పరిస్థితి ఇలా ఉండేదా అని ప్రశ్నించారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇంతే..
-ఎన్నికలు వచ్చినప్పుడల్లా నిరుద్యోగులకు, స్టూడెంట్లకు ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో ఎరవేసి, అవసరం తీరాక వారిని పట్టించుకోకపోవడం కేసీఆర్ కు మామూలేనని లక్ష్మణ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల ఓట్లు దండుకునేందుకే 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ కొత్త డ్రామాలాడుతున్నారన్నారు. 40 లక్షల మంది తెలంగాణ యువతను నిరుద్యోగులుగా మార్చిన కేసీఆర్ పాలనపై బీజేపీ యుద్ధం ప్రకటించిందని, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని చెప్పారు. ‘‘నిరుద్యోగ భృతి జాడే లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఊసే లేదు. స్థలం ఉంటే ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పినా దాని ప్రస్తావనే లేదు. రుణమాఫీ కాలేదు. రెండో విడత గొర్రెల పంపిణీ అసలే జరగలేదు. హైదరాబాద్ లో కుల సంఘాలకు భవన నిర్మాణాలు ఏమయ్యాయి. గ్రేటర్ లో వరదలు వచ్చినా, రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయినా పట్టించుకునే నాథుడే లేడు. డీఏ, ఐఆర్, పీఆర్సీల గురించి పట్టించుకోవడం లేదు. సన్నాలకు గిట్టుబాటు ధర ఎక్కడ? 57 ఏళ్లు నిండిన రైతుకు ఫించన్ ఎక్కడ? రైతులకు ఉచిత ఎరువులు ఇంకెప్పుడు ఇస్తరు? ” అని లక్ష్మణ్ నిలదీశారు.

