వాంటెడ్..సీనియర్ ఎగ్జిక్యూటివ్స్.. టెక్ కంపెనీల్లో పెరుగుతున్న సీనియర్ల నియామకాలు.. ఏడాదికి రూ.5 కోట్ల వరకు జీతం

వాంటెడ్..సీనియర్ ఎగ్జిక్యూటివ్స్.. టెక్ కంపెనీల్లో పెరుగుతున్న  సీనియర్ల నియామకాలు.. ఏడాదికి రూ.5 కోట్ల వరకు జీతం
  • టెక్​ కంపెనీల్లో పెరుగుతున్న సీనియర్ల నియామకాలు
  • జీసీసీల్లో దండిగా అవకాశాలు.. ఏడాదికి రూ.5 కోట్ల వరకు జీతం

న్యూఢిల్లీ: భారత్​లో టెక్నాలజీ రంగంలో సాధారణ నియామకాలు తగ్గినప్పటికీ, సీనియర్ లీడర్షిప్ హోదాలకు డిమాండ్ పెరుగుతోంది. ఏఐని స్వీకరించడానికి కంపెనీలు టెక్ నిపుణుల కోసం వెతుకుతున్నాయి. దేశీయ సంస్థలతో పాటు గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీలు) సీనియర్ ​పొజిషన్ల భర్తీకి మొగ్గు చూపుతున్నాయి. ఆర్థిక సంస్థలు, విమానయాన  కంపెనీలు, రిటైల్, ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తున్నాయి. 

ఏబీసీ కన్సల్టెంట్స్ రిపోర్ట్​ ప్రకారం.. గత రెండు మూడు క్వార్టర్లలో డైరెక్టర్, వైస్– ప్రెసిడెంట్ స్థాయి నియామకాలు 20 శాతం పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంతో పోలిస్తే ఈ వృద్ధి గణనీయంగా ఉంది. చాలా బహుళజాతి సంస్థలు (ఎంఎన్​సీలు) తమ గ్లోబల్ టెక్ హోదాలను భారత్​లోని జీసీసీలకు తరలిస్తున్నాయి. ఆటోమోటివ్, మైనింగ్, రవాణా వంటి రంగాలు కూడా టెక్నాలజీ ఆధారితంగా మారుతున్నాయి.

ఈ జాబ్స్కు గిరాకీ ఎక్కువ..
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డేటా ప్రొడక్ట్ హెడ్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ప్లాట్‌‌ఫారమ్స్ నిపుణులకు భారీగా డిమాండ్ ఉంది. వీరి వార్షిక వేతనం రూ. కోటి నుంచి రూ.ఐదు కోట్ల వరకు ఉంటోంది. గడిచిన కొద్ది నెలల్లో సీనియర్ల నియామకాలు మొత్తం మీద 10 నుంచి 12 శాతం పెరగగా, డిజిటల్ టెక్ లీడర్షిప్​ నియామకాలు 70 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. భారత్​లో ప్రస్తుతం 1,800కిపైగా జీసీసీలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు. 

భవిష్యత్తులో గ్లోబల్ లీడర్​షిప్ రోల్స్ మనదేశంలో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఇప్పుడు వ్యాపార వ్యూహాల్లో కీలక భాగంగా మారింది. ఇందుకోసం టాప్ టయర్ టాలెంట్ అవసరం ఏర్పడింది. ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మింత్రా, ఐటీసీ వంటి సంస్థలు ఇటీవల సీనియర్​ఎగ్జిక్యూటివ్స్​ను నియమించుకున్నాయని ఏబీసీ కన్సల్టెంట్స్ రిపోర్ట్ తెలిపింది.

టీసీఎస్లో జాబ్స్ ​25 వేల మంది ఫ్రెషర్లకు చాన్స్​
ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ 2027 ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. డిమాండ్ పెరిగితే మరింత మందిని తీసుకుంటామని ఎండీ, సీఈఓ కృతి వాసన్ తెలిపారు.  2026 ఆర్థిక సంవత్సరంలో 44 వేల మందిని ఫ్రెషర్లను తీసుకున్నామని, వ్యాపార అవసరాలను బట్టి నియామక వ్యూహాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 

గత ఏడాది 12 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందిస్తూ, ప్రాజెక్టుల నిర్వహణ శైలిలో మార్పుల వల్లే సీనియర్ స్థాయి సిబ్బందిని తగ్గించాల్సి వచ్చిందని వివరించారు. దీనికి ఏఐ టెక్నాలజీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కంపెనీ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతోందని, అది వృద్ధికి దోహదపడుతుందని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. కొత్త డీల్స్ పెరగడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు వాసన్​ వెల్లడించారు.