న్యూఢిల్లీ:ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి క్వార్టర్లో అద్భుతమైన ఫలితాలను సాధించింది. నికర లాభం 23 శాతం పెరిగి రూ.13,492 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ.10,987 కోట్ల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.2,37,848 కోట్లకు ఎగిసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2,22,864 కోట్లుగా ఉంది.
తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.9,217 కోట్లకు పెరిగింది. రెన్యూవల్ ప్రీమియంల ద్వారా రూ.61,833 కోట్లు సమకూరగా, సింగిల్ ప్రీమియం కింద రూ.56,369 కోట్లు వసూలయ్యాయి. నికర ప్రీమియం ఆదాయం రూ.1,27,250 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులు రూ.2,25,573 కోట్లకు చేరాయి. సాల్వెన్సీ నిష్పత్తి గతేడాది మొదటి క్వార్టర్లో ఉన్న 2.17 శాతంతో పోలిస్తే ఈసారి 2.42 శాతానికి మెరుగుపడిందని ఎల్ఐసీ తెలిపింది.
