V6 News

ఇదంతా పచ్చి అబద్ధం.. ఇలాంటి ఫేక్ నోటీసులను నమ్మొద్దు : హైడ్రా

ఇదంతా పచ్చి అబద్ధం.. ఇలాంటి ఫేక్ నోటీసులను నమ్మొద్దు : హైడ్రా

హైడ్రా కూల్చివేతలపై  సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న  ఫేక్ నోటీసులపై  హైడ్రా  స్పందించింది. ఇదంతా పచ్చి అబద్ధమని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ నోటీసులు పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పింది.

కొందరు  తెలంగాణ హైకోర్టు పేరుతో ఒక నకిలీ నోటీసును సృష్టించి, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. హైడ్రా చేపడుతున్న డిమాలిషన్ డ్రైవ్‌పై కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ ఫేక్ డాక్యుమెంట్లు వైరల్ కావడంపై హైడ్రా తీవ్రంగా స్పందించింది.

ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది. నకిలీ నోటీసులను తయారు చేసిన వారితో పాటు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ ఫేక్ నోటీసులను షేర్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు.ప్రజలెవరూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను, ఫేక్ నోటీసులను నమ్మవద్దని హైడ్రా విజ్ఞప్తి చేస్తోంది.