ఒకే ఓవర్లో 4,6,4,4 కొట్టిన బుడ్డోడు.. కానీ ఆ బాల్కి వైభవ్ ఔట్!

ఒకే ఓవర్లో 4,6,4,4 కొట్టిన బుడ్డోడు.. కానీ ఆ బాల్కి వైభవ్ ఔట్!

Vaibhav Sooryavanshi: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ధనాధన్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. వికెట్ పడుతుందనే భయం లేకుండా, క్రీజులోకి దిగిన మొదటి బంతి నుంచే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఒకే ఓవర్లో 4, 6, 4, 4.. నగరావాకు చుక్కలు: 
రిచర్డ్ నగరావా వేసిన ఓవర్లో వైభవ్ సృష్టించిన విధ్వంసం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. నగరావా వేసిన షార్ట్ బాల్‌ను స్క్వేర్ లెగ్ దిశగా అద్భుతమైన పుల్ షాట్‌తో ఫోర్‌గా మలిచాడు. ఆ తదుపరి బంతికి క్రీజులో స్థలాన్ని (రూమ్) చేసుకుని వైడ్ లాంగ్ ఆన్ మీదుగా ఆకాశమే హద్దుగా భారీ సిక్స్ కొట్టాడు. ఆ వెంటనే మిడ్-ఆఫ్‌ మీదుగా వరుసగా రెండు క్లాసిక్ డ్రైవ్‌లతో బంతిని సరిహద్దు దాటించాడు. ఈ విధంగా 4, 6, 4, 4 సీక్వెన్స్‌తో మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 రన్స్ చేసిన తర్వాత నగరావా షార్ట్ బాల్‌కు మిడ్-ఆన్‌లో ఉన్న బ్లెస్సింగ్ ముజారబానీకి క్యాచ్ ఇచ్చి వైభవ్ పెవిలియన్ చేరాడు. 

తొలి టీ20లో 18 బంతుల్లో 50.. ఇప్పుడు 9 బంతుల్లో 20: 
ఈ జింబాబ్వే టూర్‌లో వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో భారత జట్టుకి అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నాడు. మొదటి టీ20లో కేవలం 18 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ మ్యాచ్‌లోనూ 9 బంతుల్లో 20 పరుగులు చేసి పవర్‌ప్లేలో భారత్‌కు కిరాక్ ఆరంభాన్ని ఇచ్చాడు. కాగా వికెట్ కాపాడుకోవడం కంటే పవర్‌ప్లేను పూర్తిగా వాడుకుని ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే భారత్ కొత్త అటాకింగ్ క్రికెట్ శైలికి వైభవ్ సూర్యవంశీ ఆటతీరు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

టీమిండియా భారీ స్కోరు:  
వైభవ్ సూర్యవంశీ అందించిన ఈ ధనాధన్ ఆరంభం తర్వాతి బ్యాటర్లకు పని సులువు చేసింది. ఈషాన్ కిషన్ (81), తిలక్ వర్మ (60*) హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు కొట్టింది.