- నాడు ఏరులన్నీ నీటితో జలకళ.. నేడు వెలవెల
మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించే ఆకేరు, మున్నేరు, పాలేరు ప్రధాన వాగులు వర్షాభావంతో వెలవెలబోతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో ఈ వాగుల్లో సమృద్ధిగా నీరు ప్రవహించడం వల్ల వాటిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల ద్వారా సమీప రైతులకు రెండు పంటలకు సాగునీటి కొరత ఉండేది కాదు.
అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వానలు కురవక, అక్కడక్కడా చిరుజల్లులు మాత్రమే పడటంతో ప్రధాన వాగులన్నీ నీటి ఊట లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లాలోని 9 ఆనకట్టల పరిధిలో 6,508 ఎకరాలు, 47 చెక్‌డ్యామ్‌ల ద్వారా మరో 6,950 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఇదే పరిస్థితి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ కనిపిస్తోంది.
కాగా, రెండేండ్ల కింద వచ్చిన భారీ వరదలతో మహబూబాబాద్ జిల్లాలోని కొమ్ములవంచ, ఉగ్గంపల్లి ఆనకట్టలతో పాటు ఐదు చెక్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులు, కొత్త నిర్మాణాల కోసం రూ.170 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా, కొన్ని పనులు ప్రారంభమయ్యాయి.
మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయి. జిల్లాలో ఆకేరు వాగుపై 2 ఆనకట్టలు, 12 చెక్‌డ్యామ్‌లు, మున్నేరు వాగుపై 3 ఆనకట్టలు, 15 చెక్‌డ్యామ్‌లు, పాలేరు వాగుపై 4 ఆనకట్టలు, 20 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. మొత్తంగా 9 ఆనకట్టలు, 47 చెక్‌డ్యామ్‌లు రైతులకు సాగునీటి ఆధారంగా నిలుస్తున్నాయి. వాగుల్లో నీటి ప్రవాహం లేకపోవడంతో భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి.
గతంలో చెక్‌డ్యామ్‌ల పరిసర ప్రాంతాల్లో కిలోమీటరు మేర భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో బోర్లు, బావులు, లిఫ్ట్‌ల ద్వారా వేలాది ఎకరాల్లో సాగు జరిగేది. ప్రస్తుతం నారుమడులు తడిపేందుకు కూడా నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో భూగర్భ జలాలు క్రమంగా తగ్గున్నాయి. గత జూలైలో 4.44 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 6.21 మీటర్ల లోతుకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
