21 ఏండ్లకే యువతను పోటీకి అర్హులను చేస్తం: సీఎం రేవంత్

21 ఏండ్లకే యువతను పోటీకి అర్హులను చేస్తం: సీఎం రేవంత్

హైదరాబాద్: యువకులు ప్రజా ప్రతినిధులైతే దేశ భవిష్యత్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ జనాభాలో యువత 30 శాతం ఉన్నారని.. కానీ వారి ప్రాతినిథ్యం చట్టసభల్లో ఒక్క శాతం కూడా లేదన్నారు. 30 శాతం ఉన్న యువత చట్టసభల్లో ఒక్క శాతం ఉండరా అని ప్రశ్నించారు. కొన్ని దేశాల్లో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు వెళ్లవచ్చని.. 21 సంవత్సరాలు వస్తే సింగపూర్‎లో ప్రధాని కావొచ్చన్నారు. 

కానీ ఇండియాలో యువత ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు ఉండాలన్నారు. ఆగస్ట్ మొదటివారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. 21 ఏళ్లు నిండిన యువత ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి అర్హులని తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోడీకి పంపిస్తామని చెప్పారు. దేశ యువత జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడమే కాకుండా.. లోక్ సభ, రాజ్యసభలో యువత గళాన్ని విప్పేలా చేస్తామన్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం (జులై 25) రాత్రి హైదరాబాద్‌ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్‌)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ సాధించిన భారీ విజయమని అభివర్ణించారు. యువత ముఖంలో విజయం కనిపిస్తోందని.. ప్రధాని మోడీని తలవంచేలా చేశారని అన్నారు. జెన్ జీ పోరాటం ఇక్కడితో ఆగొద్దని.. చట్టసభల్లో గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. యువత ముఖంలో విజయదరహాసం చూస్తున్నానని.. ఉద్యమంలో  యువత ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ దేశ భవిష్యత్ యువతదేనని వ్యాఖ్యానించారు.

యువత విజయం మా ఖాతాలో వేసుకోం:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువ పోరాటమని పేర్కొన్నారు. యువత విజయాన్ని మా ఖాతాలో వేసుకోమని తెలిపారు. పార్టీలకు అతీతంగా సీజేపీ ఉద్యమానికి మద్దతు ప్రకటించారని.. అందుకే కేంద్రం దిగొచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రి రాజీనామాతో సరిపెట్టడం కాకుండా.. నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, నీట్ పేపర్ లీక్ క వ్యతిరేకంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. సోమవారం లోపు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.