మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సోలార్ మోడల్ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామంలో గృహాలు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును స్పీడప్ చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యుత్ శాఖ, టీజీ రెడ్కో అధికారులతో వెన్నచేడ్ సోలార్ ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 81 గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటని ఆమె తెలిపారు. అర్హత కలిగిన ప్రతీ ఇంటికి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను, ఆసక్తి ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు 7.5 హెచ్‌పీ సామర్థ్యం గల సోలార్ పంపులను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే గ్రామంలో గుర్తించిన అనువైన ఇండ్లలోనూ, రైతుల మోటార్లకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
