బంగారం కొనాలనుకునే ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడు ఒక ప్రశ్న మెదులుతుంటుంది.. అదేంటంటే "బంగారం ఇప్పుడే కొనేయాలా ? లేక ధరలు ఇంకా తగ్గేదాకా వేచి చూడాలా ?... దీనికి నిపుణులు చెబుతున్న స్పష్టమైన సమాధానం ఒక్కటే.. మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు కనిష్ట స్థాయికి పడిపోతుందో ఎవరికీ కచ్చితంగా తెలియదు. కాబట్టి ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తూ ఆగిపోవద్దని సలహా ఇస్తున్నారు.
ధరల పరిస్థితి ఎలా ఉందంటే
గతంలో (ఏప్రిల్ 2025 వరకు) 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. జూలై 24 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1 లక్ష 43వేలు దాటింది.
ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తగ్గేదాకా వేచి చూసే ధోరణిలో ఉన్నారని 'ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్' (IBJA) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. మరోవైపు యుద్ధాలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులు పెట్రోల్ వంటి నిత్యావసరాలకే డబ్బులు దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
ధరలు లక్షకు పడిపోయే అవకాశం ఉందా?
బంగారం ధర మళ్లీ లక్షకు పడిపోతుందని ఇప్పట్లో ఎవరూ ఆశించడం లేదని 'ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్' రెనిషా చైనాణి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో ధరలు పూర్తిగా కుప్పకూలే అవకాశం అసలు లేదు. 2026 వరకు బంగారం ధర రూ. 1.4 లక్షల నుంచి రూ. 1.5 లక్షల మధ్యలోనే కొనసాగే అవకాశం ఉంది.
మార్కెట్లో 5 నుంచి 15 శాతం వరకు చిన్నగా తగ్గుదలలు రావడం సహజమేనని, దీన్ని ధరలు పడిపోయామని అనలేమని ఆమె అన్నారు. వార్తలు చూసి కంగారుపడిపోయి అమ్మకాలు, కొనుగోళ్లు చేయకుండా.. క్రమంగా పెట్టుబడి పెట్టడమే మంచిదని సూచించారు.
ధరలు మరింత తగ్గడానికి
బంగారం ధరలు భారీగా తగ్గాలంటే కొన్ని బలమైన ఆర్థిక కారణాలు ఉండాలని బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ చెప్పారు. అవేంటంటే:
*అమెరికా డాలర్ బాగా బలపడటం.
*వడ్డీ రేట్లను భారీగా పెంచడం.
*ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గిపోవడం.
*సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు తగ్గించడం.
*గ్లోబల్ ఎకానమీ పుంజుకుని, ఈక్విటీ మార్కెట్లు బలపడటం.
ఒకవేళ గరిష్ట స్థాయి నుంచి 10 నుంచి 20 శాతం వరకు బంగారం ధర తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
