ఉత్తదవుతున్న ఉత్తిష్ట స్థానం.. హామీల సదుపాయం..హక్కులకు భంగం కాకూడదు..

ఉత్తదవుతున్న ఉత్తిష్ట స్థానం.. హామీల సదుపాయం..హక్కులకు భంగం కాకూడదు..

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నిర్మితమైన  మన పౌరపాలనా వ్యవస్థలో  పౌరునిది ఉత్తిష్ట స్థానం.  పాలనా సౌలభ్యాపేక్షతో పాలకులను తామే ఎన్నుకుని అధికారాలను వారికి కట్టబెడతారు.   ఎన్నికైన పదాధికారులు తదనుగుణంగా పాలన  సాగించగలమని  ప్రమాణం చేసి అధికార పదవిని చేపడతారు. దేశాభివృద్ధికి పాటుపడే ఉద్దేశాలను, శాసన నియమావళిని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 

 పౌర సమాజాభివృద్ధియే లక్ష్యంగా ప్రజలచేత, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వమని అర్థం చేసుకోవాలి.  అంతటి పవిత్రమైన, బాధ్యతాయుతమైన  ప్రభుత్వం రాజ్యాంగం ప్రసాదించిన హామీలను దృష్టిలో ఉంచుకుని ప్రజల కోసం అను పదబంధాన్ని సింహావలోకనం చేసుకున్నప్పుడు.. కూడు, గూడు, విద్య, వైద్యం,  వ్యక్తిగత భద్రత, స్వేచ్ఛ తదితరాలను చెప్పుకోవచ్చు.

ఆ హామీల సదుపాయాన్ని ఇతరుల హక్కులకు భంగం కలగనంతవరకు ప్రతి పౌరుడు తన హక్కుగా భావించడం సమంజసం.  రాజ్యాంగభిలషణీయమైన ఆ హక్కులను పరిరక్షించడం పౌరులచేత ఎన్నుకున్న ప్రభుత్వం నైతిక బాధ్యత.  పౌరుడి మనుగడను పదిలపరచగల అయిదు అంశాలు ప్రధానమైనవి. 

ఆహార భద్రత

మునుపటి కాలంలోగల ఆకలి చావుల పరిస్థితి నుంచి బయటపడగలిగింది మన సమాజం. అయినా అట్టడుగు వర్గాలుగా నేటికీ కొనసాగుతున్న కొంతమంది ప్రజానీకం తమ అసహాయత, అవసరాల ఒత్తిళ్లు మూలంగా భిక్షాటన ద్వారా,  నేరాల ద్వారా ఇతర అక్రమ మార్గాల ద్వారా జీవనోపాధిని పొందుతున్నది వాస్తవం.  అక్షరాస్యతకు నోచుకోని దిగువ మధ్యతరగతి ప్రజలు తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. 

ఎగువ మధ్య తరగతి ప్రజానీకం చిన్నపాటి వ్యాపారాలు లేదా ఉద్యోగాలతో  సరిపెట్టుకుంటున్నారు. మధ్యతరగతి జనం చిన్న చిన్న భూకమతాలు, ఇతర ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాలతో దిగువ, ఎగువ మధ్య తరగతి వర్గాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మిగిలింది ధనిక వర్గం. వారి సంఖ్య చిన్నదే అయినా సమాజంలో వారి స్థానం ప్రముఖమైనదిగా చెల్లుబాటు అవుతున్నది. 

 వీరిలో  పేదలకు సహాయంచేసే మనస్తత్వం గలవారు చాలా తక్కువ.  తమ ధనిక స్థానాన్ని పదిలపరుచుకునే క్రమంలో వారు నీతి, నియమాలు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడటానికి వెనుకాడటం లేదు. మరింతగా ఆస్తులు సంపాదించడంలో  తలమునకలై తమకోసం తాము అనే భావనతో జీవిస్తున్నారు. అలాంటి  అసమానతలకు చరమగీతం పాడి స్థాయీపరంగా అందరినీ ఒకే వేదికపైకి తేవాల్సిన అవసరం ఉంది. 

గృహవసతి

 బడుగు, బలహీన వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలలో గృహవసతికి నోచుకోని జనం కోకొల్లలుగా నేటికీ దర్శనమిస్తున్నారు. వారికి  స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకునే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ నిపుణులుగా తీర్చిదిద్ది, ఆర్థిక వెసులుబాటును అందించగల మార్గాలను ప్రవేశపెట్డడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రగతి సాధించుకోవచ్చు. అలా కాకుండా  ప్రభుత్వమే గృహనిర్మాణ ఉద్యమం చేపట్టి ఆ సమస్యలకు పరిష్కారం చూపే ప్రక్రియ శాశ్వత పురోభివృద్ధికి  సమాధానం కాదు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఓట్లు దండుకునేందుకు సరిపోతుందేమో కాని దేశ సుస్థిరతకు మార్గం కాదు.

విద్య

విద్య వికాసానికి మార్గం చూపుతుంది. వికసిత సమాజాన్ని నిర్మించడం పాలనాపరంగా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.  స్వాతంత్ర్య సాధన అనంతరం ఊరూరా బడి  కార్యక్రమంతో  ప్రతి ఊరిలో బడిని ఆవిష్కరింపచేయటంలో కృతకృత్యులం అయ్యామని చెప్పుకోవచ్చు.  

అలా ఓ ఐదు దశాబ్దాల విద్యాలయాలను విద్యాబోధన ప్రక్రియలో  గౌరవంగా నిలుపుకుంటూ గ్రామవాసులకు సైతం హితబోధనలు అందిస్తూ, దేశ సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేస్తూ తమ గుర్తింపును నిలుపుకున్నారు.  తద్వారా ఎంతోమంది మేధావులను, నేతలను తయారుచేయడంలో వారందించిన సేవలు అద్వితీయం. అనిర్వచనీయం.  అనంతరం రాజకీయంగా పాలకుల పలుకుబడి పలుచనైపోవడం ఆరంభమైంది. రాజకీయ నాయకులు, పాలకుల బలహీనతలను ఆసరా చేసుకున్నా ఉపాధ్యాయులు కొందరు తమ దృష్టిని సొంత వ్యవహారాలవైపు మరల్చుకుంటున్నారు. 

పర్యావసానంగా పాఠశాలల్లో విద్యా విధానాలు అటకెక్కాయి. నేడు అవి ప్రభుత్వ పాఠశాలల ఉనికిని మింగేసే దశకు చేరుకున్నాయి.  ప్రైవేటు పాఠశాలల ఫీజులు సామాన్య పౌరునికి గుదిబండగా పరిణమించాయి.  విద్యా ప్రమాణాలు కుంచించుకుపోవడంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సమర్థ పౌరుల ఎదుగుదల కుంటుపడిపోతున్నది. 

పౌరభద్రత

శాంతి భద్రతల పరిరక్షణలో పౌర భద్రత, ఆస్తి భద్రతలు ఇమిడి ఉంటాయి. పోలీసు శాఖ నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ సంబంధిత విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. రాజకీయాల క్రీనీడ పోలీసు శాఖపై పడటంతో పోలీసుల సమర్థతపై విమర్శల పర్వం మొదలైంది. 

క్షేత్రస్థాయి పోలీసు అధికారుల మనోధైర్యం దెబ్బతినకముందే పోలీసు వ్యవస్థను నిర్మాణాత్మక మార్పులతో తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది.  దారిమళ్ళిన పౌర పాలన వ్యవస్థ తన ఉత్తమ స్థాయిని పదిల పరుచుకోవలసిన అవసరమెంతో  ఉన్నది. 

అందుకే ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతలను జాతీయాభివృద్ధి కోణంలో నిర్వహించడం ఆరంభించాలి. 
 తన ఓటు అమూల్యమైనదనే  సంకల్పంతో  నిష్పక్షపాత వైఖరితో  రాజ్యాంగ దేశాల పరిరక్షణే  ధ్యేయంగా  ఆలోచించి ఆచరించగల వ్యక్తులకు పట్టం కట్టాలి. దేశ ప్రగతికి ఓటరు దేవుళ్ళు మార్గ దర్శకులుగా నిలవాలి.

వైద్యం 

సమాజంలోని పౌరులకు, ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులకు నెలకొల్పుతూ, వివిధ కారణాల మూలంగా  జబ్బునపడినవారికి చికత్స​ అందించేందకు ఆసుపత్రులను నెలకొల్పడం ప్రభుత్వం బాధ్యత.  అయితే చౌకబారు రాజకీయాలతో ప్రభుత్వ  ఆసుపత్రులకు వనరుల కరువు దాపురించింది. దీంతో పౌరులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి  ఆర్థికపరమైన దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీయవలసిని మేధావులు, ప్రతిపక్ష నాయకుల గొంతులు మూగవోయాయి.

- పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.