టోక్యో బరిలో 9 మంది బాక్సర్లు

టోక్యో బరిలో 9 మంది బాక్సర్లు
  • గోల్డెన్​ పంచ్‌‌ పడేనా?
  • మేరీకోమ్‌‌, అమిత్‌‌పై భారీ ఆశలు
  • టోక్యో బరిలో 9 మంది బాక్సర్లు

న్యూఢిల్లీ: బీజింగ్‌‌ ఒలింపిక్స్‌‌లో విజేందర్‌‌ సింగ్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ గెలిచిన తర్వాత.. లండన్‌‌ గేమ్స్‌‌లో బరిలోకి దిగిన ఇండియా స్టార్‌‌ బాక్సర్‌‌ ఎంసీ మేరీకోమ్‌‌ కాంస్యంతో చరిత్రను రిపీట్‌‌ చేసింది. కానీ 2016 రియో ఒలింపిక్స్‌‌కు వచ్చేసరికి మన బాక్సర్ల పంచ్‌‌ ఢీలా పడింది. కేవలం ముగ్గురే క్వాలిఫై అయినా.. ఒక్కరు కూడా పతకం గెలవలేకపోయారు. దీంతో గత చరిత్రను తుడిచిపెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ఇండియా నుంచి తొమ్మిది మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. టోక్యో బెర్త్‌‌ సాధించే క్రమంలోనూ ఇంటర్నేషనల్‌‌ ఈవెంట్స్‌‌లో మన బాక్సర్ల పంచ్‌‌ అదిరింది. కాబట్టి  ప్రస్తుత ఫామ్‌‌ ప్రకారం చూసుకున్నా.. టోక్యోలో కనీసం మూడు పతకాలైనా గ్యారంటీ అనే టాక్‌‌ వినబడుతోంది. అయితే ఇందులో స్వర్ణం ఎవరు సాధిస్తారనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది.

మేరీ ఏం  చేస్తుందో..
ఇండియా బాక్సింగ్‌‌ పోస్టర్‌‌ గర్ల్‌‌గా పేరు తెచ్చుకున్న ఎంసీ మేరీకోమ్‌‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఆరుసార్లు వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన మేరీ.. విమెన్స్‌‌ ఫ్లయ్‌‌ వెయిట్‌‌ (51 కేజీ)లో గోల్డ్‌‌ మెడల్‌‌ రేస్‌‌లో ఉంది. 38 ఏండ్ల వయసులో ఉన్న మేరీకి ఇది ఆఖరి ఒలింపిక్స్‌‌. దీంతో కచ్చితంగా స్వర్ణం గెలవాలన్న టార్గెట్‌‌తో బరిలోకి దిగుతోంది. వరల్డ్‌‌ మూడో ర్యాంకర్‌‌, ఆసియా చాంపియన్‌‌ పూజా రాణి (75 కేజీ)పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. లవ్లీనా బోర్గెహెన్‌‌ (69 కేజీ), సిమ్రన్‌‌జిత్‌‌ కౌర్‌‌ (60 కేజీ) కూడా సంచలనాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటలీలో ట్రెయినింగ్‌‌ తీసుకుంటున్న వీరంతా ఆదివారం టోక్యోకు బయలుదేరుతారు.

ఫేవరెట్‌‌గా అమిత్‌‌..
రియోతో పోలిస్తే ఈసారి బాక్సర్ల సంఖ్య పెరగడంతో అంచనాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐదుగురు పురుష బాక్సర్లలో అమిత్‌‌ పంగల్‌‌ (52 కేజీ) హాట్‌‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడున్న ఫామ్‌‌ను బట్టి చూస్తే అమిత్‌‌కు పతకం సాధించడం పెద్ద లెక్క కాదు. కాకపోతే అది స్వర్ణం అయితే బాగుంటుందన్నది ఫ్యాన్స్‌‌ కోరిక. ‘మిషన్‌‌ టోక్యో’ పేరుతో గత మూడేండ్ల నుంచి అమిత్‌‌ విపరీతంగా శ్రమిస్తున్నాడు. దాని ఫలితమే ఇటీవల జరిగిన చాలా టోర్నీల్లో అతను ఎన్నో పతకాలు సాధించాడు. 2018 ఆసియా గేమ్స్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌ సాధించిన అమిత్‌‌.. వరల్డ్‌‌ బాక్సింగ్‌‌లో సిల్వర్‌‌ సాధించిన తొలి ఇండియన్‌‌గా రికార్డు సృష్టించాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్‌‌ ఈవెంట్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌తో ఒలింపిక్‌‌ బెర్త్‌‌ సాధించాడు. ఆ తర్వాత జరిగిన వరల్డ్‌‌కప్‌‌లో గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిశాడు. ఇక ఈ వెయిట్‌‌ కేటగిరీలో అమిత్‌‌ నంబర్‌‌వన్‌‌గా బరిలోకి దిగడం కూడా అతనికి కలిసొచ్చే అంశం. ఇతర కేటగిరీల్లో మనీశ్‌‌ కౌశిక్‌‌ (63 కేజీ), వికాస్‌‌ క్రిషన్‌‌ (69 కేజీ), ఆశిష్‌‌ కుమార్‌‌ (75 కేజీ), సతీశ్‌‌ కుమార్‌‌ (91 కేజీ) కూడా పతకంపై భారీ ఆశలు పెట్టుకున్నారు.