దేశంలో రోజుకు 90 రేప్ లు

దేశంలో రోజుకు 90 రేప్ లు

కేంద్రం గణాంకాల ప్రకారం దేశంలో రోజూ 90మంది మహిళలపై మృగాళ్లు విరుచుకుపడుతున్నారని వెల్లడైంది. 2017లో నమోదైన కేసుల వివరాలను కేంద్రం ఓ రిపోర్ట్ లో వెల్లడించింది. 2017లోమొత్తం32,500 రేప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అన్ని కోర్టులూ కలిసి 18,300 రేప్ కేసులను మాత్రమే పరిష్కరించాయి. 2017 చివరినాటికి ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 1,27,800కు చేరిందని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇక మహిళలపై అతికిరాతకంగా హత్యాచారం జరుగుతున్న సంఘటనలూ తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.ఢిల్లీలో నిర్భయ సంఘటన మొదలుకొని హైదరాబాద్ లో దిశ మర్డర్ ఇన్సిడెంట్ వరకూ అనేక కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

డిసెంబర్ 2012

ఢిల్లీలో కదులుతున్నబస్సులో 23 ఏళ్ల స్టూడెంట్ పై ఐదుగురు కామాంధులు అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపర్చారు.ఆమె లండన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయింది. మైనర్‌‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు . ఒకడు విచారణ పూర్తి కాకముందే జైలు గదిలో ఉరేసుకున్నాడు. నలుగురికి కోర్ట్ ఉరిశిక్ష విధించిం ది. వీరికి ఇప్పటికీ ఉరిశిక్ష అమలు కాలేదు. మూడేళ్ల శిక్ష పూర్తిచేసుకుని మైనర్ విడుదలయ్యాడు.

జనవరి 2018

జమ్మూకాశ్మీర్లోని కథువాలో 8 ఏండ్ల ముస్లిం అమ్మాయిపై జరిగిన గ్యాంగ్ రేప్, హత్య ఎంతో మందిని కదిలించింది. ఈ కేసులో ఒక హిందూ పూజారి, ముగ్గురు పోలీస్ ఆఫీసర్లతో సహా ఆరుగురు దోషులుగా తేలారు.

జూలై 2019

యూపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సేంగర్ తనను 2017లో అత్యాచారం చేశాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది.అయితే ఆమె కారులో వెళ్తుండగా సేంగర్ యాక్సిడెంట్ చేయించాడని, ఆసమయంలో కారులో ఉన్న బాధితురాలి లాయర్, ఇద్దరు బంధువులూ చనిపోయారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను సేం గర్ ఖండించారు.

నవంబర్ 28, 2019

వెటర్నరీ డాక్టర్ దిశను కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు అతికిరాతకంగా ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డారు . ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు . పదిరోజుల తర్వాత నలుగురు నిందితులూ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.

సెప్టెంబర్ 20, 2019

కేంద్ర ఇంటర్నల్ ఎఫైర్స్ సహాయ మంత్రిగా పనిచేసిన స్వామి చిన్మయానంద్ తనను రేప్ చేశారని, సెక్సువల్ హరాస్మెంట్ చేశారంటూ ఒక లా స్టూడెంట్ కంప్లయింట్ చేసింది. దీంతో ఆ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

డిసెంబర్ 5, 2019

యూపీలోని ఉన్నావ్ లో 23 ఏళ్ల మహిళపై కొందరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు . ఆమె కోర్టుకు వెళ్తుండగా దారిలోనే పెట్రోల్ పోసి తగలబెట్టారు . ఆమె దాదాపు కిలోమీటర్ దూరం మంటలతోనే పరుగెత్తుకుంటూ వచ్చిన సంఘటన దేశమంతా సెన్సేషన్ అయింది.