అయ్యో బిడ్డా .. ఎంత కష్టమొచ్చే.. 9 ఏండ్ల బాలుడికి  బ్రెయిన్​ ట్యూమర్​

అయ్యో బిడ్డా .. ఎంత కష్టమొచ్చే.. 9 ఏండ్ల బాలుడికి  బ్రెయిన్​ ట్యూమర్​

పెనుబల్లి, వెలుగు:   తమ ఇద్దరు కొడుకులకు బ్రెయిన్​ ట్యూమర్ వ్యాధి రావడం ఆ దంపతులు తల్లడిల్లిపోతున్నారు.   ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన సానిక చెన్నారావు , వనజ దంపతులకు అభిషేక్​ ​కుమార్(11) , క్రిస్టోఫర్​ (9)  ఇద్దరు కొడుకులు.  చెన్నారావు ఆర్​ఎంపీగా  పనిచేస్తున్నాడు. వారి పెద్దకొడుకు అభిషేక్​ కుమార్​ కు రెండేండ్ల కింద తల నొప్పి, కళ్లు తిరగటం వంటి సమస్యలు రావడంతో హైదరాబాద్​ లోని ప్రైవేట్​ హాస్పిటల్​లో టెస్ట్​లు చేయించగా బ్రెయిన్​ ట్యూమర్​ అని డాక్టర్లు తెలిపారు.

పెద్ద కొడుకును బతికించడానికి తమకు వున్న కొద్దిపాటి పొలాన్ని,  సొంత ఇంటిని అమ్మి  రూ.8లక్షలతో  ఆపరేషన్​ చేయించారు.  అయినా కూడా రెండు నెలల తర్వాత బ్రెయిన్​లో ఇన్​ఫెక్షన్​ వచ్చి 2022 జూలై లో చనిపోయాడు.  ఆ బాధ నుంచి తేరుకోక ముందే  జెనటికల్​ వచ్చే వ్యాధి కనుక  రెండో కొడుకు క్రిస్టోఫర్​ కు  టెస్ట్​లు చేయించాలని డాక్టర్లు సూచించారు. బెంగుళూర్​ లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ న్యూరో సైన్సెస్​లో టెస్ట్​లు చేయించగా బ్రెయిన్​ ట్యూమర్​ మొదటి స్టేజ్​లో వుందని డాక్టర్లు తెలపడంతో  చెన్నారావు దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పెద్దకొడుకు కోసం ఉన్నదంతా అమ్మి ఖర్చు పెట్టామని, చిన్న కొడుకుకు  ఎలా  ట్రీట్​మెంట్​ చేయించాలో అర్థం కాక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.  

దాతలు స్పందించి,  సానిక చెన్నారావు, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, సత్తుపల్లి బ్రాంచ్​, అకౌంట్​ నెంబర్​ 635202010015892, ఐఎఫ్​ఎస్​సీ కోడ్​ యూబీఐఎన్​0563528,  ఫోన్​పే నెంబర్​ 9603396988 లకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.