బీమా సొమ్ము కోసం హత్యలు.. అనారోగ్యంతో ఉన్న వారే టార్గెట్

బీమా సొమ్ము కోసం హత్యలు.. అనారోగ్యంతో ఉన్న వారే టార్గెట్

ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబానికి అండగా ఉంటుందని బీమా చేయించుకుంటారు జనం. కానీ, అదే బీమా సొమ్ము కోసం అమాయకుల ప్రాణాలు తీస్తోంది నల్లగొండ జిల్లాలో ఓ ముఠా. వ్యక్తుల్ని హత్య చేసి, యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తూ డబ్బులు దండుకుంటోంది.నల్లగొండ గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల పేరిట బీమా చేయిస్తూ .. ఆ సొమ్ము అమాయకులను హత్య చేస్తోంది  ఓ ముఠా. బీమా డబ్బుల కోసం మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసి, యాక్సిడెంట్స్ గా చూపించే ప్రయత్నం చేసింది. ఎఫ్ఐఆర్ కాపీతో బీమాకు క్లెయిమ్ చేస్తోంది. వచ్చిన మొత్తంలో కుటుంబసభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా మొత్తాన్ని ముఠా సభ్యులు పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్టు సమాచారం.

దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ బీమా ఏజెంట్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్  కోసం గాలిస్తున్నారు.నల్లగొండ దామచర్ల మండలంలోని కొండ్రపోల్ కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్ పల్లి-అద్దంకి రహదారి పక్కన కనిపించింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యులు భావించారు.  అయితే, అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలను చూసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా దందా వెలుగులోకి వచ్చింది.

బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించింది కోటిరెడ్డి భార్య. ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంట్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. బీమా సొమ్ము కోసం గత మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిర్యాలగూడలోని ఓ వ్యక్తిపై కోటి బీమా చేయించి యాక్సిడెంట్లో చనిపోయాడని నమ్మించినట్లు బయటపడింది. బీమా సొమ్ములో అతడి భార్యకు 20శాతం ఇచ్చి మిగిలినదంతా ముఠా సభ్యులే పంచుకున్నారు. 2018లో గుంటూరులోనూ 50లక్షల రూపాయల బీమా చేయించి…ఓ వ్యక్తిని హతమార్చినట్లు పోలీసులకు తెలిపాడు ఏజెంట్. ఆ కేసులో అరెస్ట్ అయిన బీమా ఏజెంట్ బెయిల్ పై వచ్చి.. మళ్లీ అదే  అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.