వాహనం కొనుగోలుకు ఆధార్ కంపల్సరీ

వాహనం కొనుగోలుకు ఆధార్ కంపల్సరీ
  • మార్చి 1నుంచి షోరూముల్లో బయోమెట్రిక్

వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో మరింత పారదర్శకత పెంచేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వాహనాల కొనుగోలు సందర్భంగా వాహనాదారుడి ఆధార్ నంబర్ ను కచ్చితంగా తీసుకుంటున్నారు. కానీ ఆధార్ విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు రవాణాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. చాలా మంది తమ ఆధార్ నంబర్ ను తప్పుగా నమోదు చేయడం, కలర్ జిరాక్స్ లో నంబర్ మారుస్తూ ఆధార్ సంఖ్య సమర్పిస్తున్నారు. డీలర్లు, ఏజెంట్లు ఇందుకు సహకరిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డుల విషయంలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఆధార్ ను డేటా బేస్ కు లింక్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వాహనదారులు సమర్పిస్తున్న ఆధార్ సరైనదేనా కాదా అన్న విషయం తేల్చేందుకు రవాణా శాఖ  దగ్గర ఎలాంటి మెకానిజం లేదు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ లో ఆధార్‌‌ అనుసంధానం చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తోంది. ఇందుకోసం అన్ని వాహనాల షో రూమ్ లలో బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.

తాజాగా హైదరాబాద్ ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఆటోమొబైల్ డీలర్లతో జాయింట్ ట్రాన్స్ పోర్ కమిషనర్ రమేష్ సమావేశమయ్యారు. మార్చి 1 నాటికి బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. బయోమెట్రిక్‌‌ మిషన్ల తో వాహనాదారుడి వేలిముద్రలను సేకరించే అవకాశం ఉంటుంది. దీంతో ఎవరైనా ఆధార్ నంబర్ తప్పుగా ఇచ్చినప్ప టికీ వారి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా సరైన ఆధార్ నంబర్ సంఖ్యను గుర్తించవచ్చు. ఈ విధానం ద్వారా వాహనాల రిజిస్ట్రేష న్ లో మరింత పారదర్శకత వస్తుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

రవాణా శాఖ తాజా నిర్ణయంతో ఇక నుంచి ఆటోమొబైల్ సంస్థలే వాహన్ పోర్టల్ లో చాసిన్ నంబర్, ఇంజిన్ తో పాటు ఇతర వివరాలను పొందుపరుస్తారు. ఇవే వివరాలను టెంపరరీ రిజిస్ట్రేష న్ సమయంలో డీలర్లు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఇచ్చే ఆధార్ సంఖ్యను ఇక నుంచి డేటా బేస్ కు లింక్ చేస్తారు. దీంతో ఆధార్ తో పాటు ఆతని పేరుపైన ఉన్న వాహనం వివరాలకు కూడా రికార్డు అవుతాయి. డేటా బేస్ లింకు కారణంగా తప్పుడు ఆధార్ నంబర్ నమోదు చేయడానికి అవకాశం ఉండదు. పైగా ఆటోమొబైల్ షో రూం లో ఉండే బయోమెట్రిక్ యంత్రాల్లో వేలి ముద్ర వేయగానే అప్పటికే ఆ వ్యక్తి పేరుపైన ఉన్న వాహనాల సంఖ్య కూడా తెలిసిపోతుంది. ఆధార్ అనుసంధానం సమయంలో OTP, బయోమెట్రిక్ పద్ధతుల ద్వారా వివరాలు కన్ఫాం చేసుకోవచ్చు.

ఏప్రిల్ ఒకటి నుంచి షోరూముల్లో నాన్ ట్రాన్స్ పోర్టు వాహనాలను రిజిస్ట్రేష న్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ కమిటీ షో రూమ్ ల్లో నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తే మాత్రం ఈ బయోమెట్రిక్ మిషన్ల ఏర్పాటు ఉపయోగపడనుంది. పైగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వాహనాదారులు అదే పనిగా RTA  కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పనిలేదు. ఏజెంట్లు, మధ్యవర్తుల దోపిడీ కూడా తప్పుతుంది.