కొత్త మాల్స్​లో సగం ఢిల్లీ​, హైదరాబాద్​లోనే

కొత్త మాల్స్​లో సగం ఢిల్లీ​, హైదరాబాద్​లోనే

బిజినెస్ డెస్క్, వెలుగు​: రాబోయే  నాలుగయిదేళ్లలో  దేశంలోని సిటీలలో వచ్చే కొత్త మాల్స్​లో సగం ఢిల్లీ–-ఎన్​సీఆర్​, హైదరాబాద్​ సిటీలలోనే రానున్నట్లు ఒక రిపోర్టు తెలిపింది. కొత్త బ్రాండ్​లు వస్తుండటంతో పాటు, ఇప్పుడున్న బ్రాండ్​లు విస్తరణ వైపు చూస్తుండటంతో రియల్​ ఎస్టేట్ డిమాండ్​ జోరందుకుంటుందని ఎనరాక్​ కన్సల్టింగ్​ తన రిపోర్టులో వెల్లడించింది. రిటెయిలర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఆర్​ఏఐ)తో కలిసి ఈ రిపోర్టు తయారు చేసినట్లు  తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో డెవలపర్లు 25 మిలియన్​ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మాల్స్​ ప్రాజెక్టులను చేపట్టాలని ప్లాన్​ చేస్తున్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. 2022 లో వినియోగం పెరగడంతో రిటెయిల్​ మార్కెట్​ బాగా ఊపందుకుందని, రియల్​ఎస్టేట్​ రంగానికి ఇది మేలు చేస్తుందని వెల్లడించింది.  కొత్త మాల్స్​లో 46 శాతం నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​ (ఎన్​సీఆర్​), హైదరాబాద్​ సిటీలలోనే వస్తున్నాయని, 19 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాతి ప్లేస్​లో ఉందని  తెలిపింది. 

2022లో 2.6 మిలియన్​ చదరపు అడుగులలో  మాల్స్​...

ఏడు సిటీలలోనూ కలిపి 2022 లో 2.6 మిలియన్​ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్​ ఏర్పాటయినట్లు ఎనరాక్​ రిపోర్టు తెలిపింది. 2021 తో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువని పేర్కొంది. దేశంలోని ఏడు సిటీలలోనూ కలిపి మొత్తం 51 మిలియన్​ చదరపు అడుగులలో మాల్స్​ ఏర్పాటయినట్లు వెల్లడించింది. ఇందులో ఎన్​సీఆర్​, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్​, బెంగళూరులకు 62 శాతం వాటాఉందని పేర్కొంది.  

విస్తరణ బాటలో రిటైల్ చెయిన్లు

పెద్ద పెద్ద రిటెయిల్​ చెయిన్స్​ భారీగా విస్తరించాలని ప్లాన్లు వేస్తున్నాయి. రిలయన్స్​ ఇండస్ట్రీస్​, టాటా, ఆదిత్య బిర్లా వంటి పెద్ద గ్రూపులన్నీ ఆఫ్​లైన్​ రిటెయిల్​ బిజినెస్​లను పెంచాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ బ్రాండ్స్​తో పార్ట్​నర్షిప్స్​ ఏర్పాటులో రిలయన్స్​ రిటెయిల్​ తలమునకలుగా ఉందని ఎనరాక్​ కన్సల్టింగ్​ ఈ రిపోర్టులో పేర్కొంది. ఇంటర్నేషనల్​ రిటెయిలర్​ గ్యాప్​తో కలిసి  కొత్త స్టోర్లను ఈ కంపెనీ తెరవనుందని వెల్లడించింది. గేలరీస్​ లాఫాయెట్​తో ఇటీవలే ఆదిత్య బిర్లా ఫ్యాషన్​ అండ్​ రిటెయిల్​ లిమిటెడ్​ తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీతో కలిసి మన దేశంలో లగ్జరీ డిపార్ట్​మెంటల్​ స్టోర్లు, ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్​ ఏర్పాటు చేయాలనేది ఆదిత్య బిర్లా గ్రూప్​ ఆలోచన. కొత్తగా వైట్​కాలర్​ ఉద్యోగాలలో చేరే వాళ్లు, ఇప్పటికే సంపాదన బాగున్న వారి వల్ల ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్​ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇండియా రిటెయిల్​ మార్కెట్​ 2032 నాటికి 2 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్కెట్​ సైజు 2021 లో 690 బిలియన్​ డాలర్లుగా ఉంది.