సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. శనివారం ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 100 శాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని, డ్రెస్ కోడ్ పాటించాలని చెప్పారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మెడికల్ వార్డులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల సహకారం అభినందనీయమన్నారు.
